సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తన వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ సందర్భంగా మాట్లాడిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఎస్వీఆర్, ఏఎన్ఆర్ లపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. బాలయ్య వ్యాఖ్యలపై అక్కినేని మనవాళ్ళు తీవ్రంగా స్పందించారు. తాజాగా, ఎస్వీఆర్ మనవాళ్ళు కూడా స్పందించారు. అయితే వీరు బాలకృష్ణ యథాలాపంగా చేసిన వ్యాఖ్యలు, రాద్ధాంతం అవసరం లేదు అన్నారు. బాలకృష్ణ చేసిన విషయాల మీద మీడియా, సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ వస్తున్నాయని వారు పేర్కొన్నారు.
స్వర్గీయ ఎస్వీ రంగారావు గారి కుటుంబ సభ్యులుగా, మనవలుగా తాము ఒకే విషయం చెప్పాలనుకుంటున్నామని, తమకు, బాలకృష్ణకు చాలా మంచి అనుబంధం ఉందని తెలిపారు. తాము ఒక కుటుంబంగా ఉంటామని వెల్లడించారు. ఆయన మాట్లాడినది తోటి నటుడితో జరిగిన సంభాషణ గురించి అని గుర్తు చేశారు. ఈ విషయంలో తమకు, తమ కుటుంబ సభ్యులకు ఎలాంటి వివాదం కనిపించడం లేదన్నారు. మీడియాలో ఈ విషయాన్ని ఇంకా పెంచవద్దని కోరారు. ఇందులో వివాదాన్ని తీసుకొచ్చి తమకు, తమ కుటుంబ సభ్యులకు, నందమూరి వంశానికి, నందమూరి వారసులకు ఉండే అనుబంధాన్ని ఇబ్బందులకు గురి చేయవద్దని అభిమానులకు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఎస్వీఆర్ మనవళ్ళు ఎస్వీ రంగారావు (చిన్న), ఎస్.వి.ఎల్.ఎస్. రంగారావు పేర్కొన్నారు.