వైజాగ్ బీచ్‌లో ఇసుక ఒక్కసారిగా నల్లగా మారిపోయింది. దీంతో బీచ్‌కు వచ్చేవారంతా భయాందోళన చెందుతున్నారు. విశాఖ సాగరతీరంలోని ఆర్కే బీచ్‌లో ఇసుక నలుపు వర్ణంలోకి మారిపోయింది. ప్రతి రోజూ సాయంత్రం ఈ బీచ్‌కు చాలా మంది వస్తుంటారు. బీచ్‌లో సరదాగా కాలక్షేపం చేస్తుంటారు. వారంతా ఇప్పుడు నల్లగా మారిన ఇసుకను చూసి బెంబేలెత్తిపోతున్నారు.
కాలుష్యం కారణంగానే నల్లగా మారుతోందా? అంటూ మరికొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు డ్రైన్ వాటర్ సముద్రంలో కలవడం వల్లే ఇసుక అలా మారిందని ఆరోపణ చేస్తున్నారు. వాస్తవానికి విశాఖ సముద్రతీరంలోని ఇసుక నల్లగా మారడం కొత్తేమి కాదు. గత ఏడాది రాఖీ పౌర్ణమి తర్వాత అంటే ఆగస్టు 11వ తేదిన కూడా ఈ విధంగానే జరిగింది. ఆ సమయంలో వైజాగ్ బీచ్ కు ప్రమాదం ఉందని అందరూ హడలెత్తిపోయారు. కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు సూచించారు.
ఏ తీర ప్రాంతంలో అయితే ఇనుప ధాతువు ఎక్కువగా ఉంటుందో అక్కడ ఇసుక నల్లగా మారుతుందని ఆంధ్రా యూనివర్సిటీ సముద్ర గర్భ అధ్యయన శాస్త్ర విభాగం రిటైర్డ్ ప్రొఫైసర్ ప్రసాదరావు వివరణ ఇచ్చారు. తీరానికి దగ్గర్లో అగ్నిపర్వతాలు, ఖనిజాల గనులు ఉన్నప్పటికీ అక్కడంతా ఇసుక ఆయా రంగులతో ఉంటుందన్నారు. కాబట్టి విశాఖలో ఇసుక నల్లగా మారడంపై ఆందోళన చెందొద్దని తెలిపారు.