జీడిపప్పు పరిశ్రమలు నష్టాల్లోకి వెళ్లడంతో రైతులు, వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. జీడిపప్పుకు ఫేమస్ అయిన వేటపాలెంలో 10 పరిశ్రమలు మూతపడ్డాయి. 5,500 మంది కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది.
జీడిపప్పు అంటే ఇష్టపడనివారంటూ ఎవ్వరూ ఉండరు. ఫుడ్ లవర్స్ ఎంతగానో ఇష్టపడే ఈ జీడిపప్పు అటు తయారీదారులకు, కార్మికులకు కష్టాలనే మిగుల్చుతోంది. జీడిపప్పు పరిశ్రమ పరిస్థితి ఇప్పుడు దారుణంగా ఉంది. కొనబోతే కొరివి..అమ్మబోతే అడవి అన్నట్లుగా ఆ వ్యాపారం సాగుతోంది. ఏపీలోని వేటపాలెంలో జీడిపప్పు చాలా ఫేమస్. అక్కడ వేలాది మంది కార్మికులు, వందలది మంది వ్యాపారులు జీడిపప్పు పరిశ్రమ ద్వారా ఉపాధి పొందుతున్నారు. 150 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన వేటపాలెం జీడిపప్పు పరిశ్రమకు ప్రభుత్వాల ద్వారా ఏ గుర్తింపు లభించలేదు.
స్థానికంగా చాలా మందికి ఈ పరిశ్రమ ఉపాధి మార్గంగా ఉంది. చిన్నతరహా పారిశ్రామికవేత్తలు ఈ పరిశ్రమను అభివృద్ధి చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే గత వందేళ్లుగా లేని జీడిపప్పు కష్టాలు మూడేళ్లుగా వచ్చిపడ్డాయి. కరోనా తర్వాత జీడిపంట రైతులు ఆక్వా కల్చర్ వైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో జీడిపంట లేక ఇతర ప్రాంతాల నుంచి జీడిగింజలు దిగుమతి చేసుకునే పరిస్థితి వచ్చింది.
మార్కెట్లో ఇతర ప్రాంతాల వ్యాపారులతో పోటీ పడలేక వేటపాలెం జీడిపప్పు ఉత్పత్తిదారులు నష్టాలను చవిచూస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం వేటపాలెం పరిశ్రమలన్నింటినీ ఒక క్లస్టర్ కిందకు తెచ్చి రాయితీలు, సౌకర్యాలు కల్పించాలని వ్యాపారులు, యజమానులు కోరుతున్నారు. ఇక్కడ 30 పరిశ్రమలు ఉంటే నష్టాల వల్ల కొన్ని మూతపడ్డాయి.
వేటపాలెంలో మొత్తం 30 పరిశ్రమలు ఉంటే అందులో 10 మూతపడగా మిగిలిన 20 ఉన్నాయి. అందులో కూడా కార్మికులను సగానికిపైగా తగ్గించేశారు. బాపట్లలో 5500 మంది జీడి కార్మికులు ఉపాధి లేక ఆందోళన చెందుతున్నారు. తమ వ్యాపారం రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందోనని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. వేటపాలెంలో జీడిపరిశ్రమను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని వ్యాపారులు, కార్మికులు కోరుతున్నారు.