టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) అరెస్ట్‌పై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.అవినీతి కేసులో అరెస్టయితే తెలుగుదేశం నాయకులు ఆయనను ఒక విప్లవకారుడిలా బిల్డప్ ఇస్తున్నారని విమర్శించారు. టీడీపీ, దాని అనుబంధ శక్తులు సాగిస్తున్న దుష్ప్రచారం, తాము ఆ ప్రచారాన్ని ఎదుర్కొంటున్న తీరు రేపటి సీఎం జగన్ (CM Jagan) ప్రసంగంలో ప్రస్తావనకు వస్తాయని సజ్జల తెలిపారు. రేపు విజయవాడ(Vijayawada)లో వైసీపీ పార్టీ ప్రతినిధుల సభ నిర్వహిస్తోంది. దాదాపు 8 వేల మంది పార్టీ నేతలు ఈ ప్రత్యేక కార్యక్రమానికి హాజరుకానున్నారు. వైసీపీ (YCP) ప్రజాప్రతినిధులను, పార్టీలోని ఇతర నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి సీఎం జగన్ కీలక ప్రసంగం చేయనున్నారు.
మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, పార్టీకి దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం విప్లవాత్మక పథకాలు సీఎం జగన్ తెచ్చారని సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) అన్నారు . గడప గడపకు కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని ఇళ్లను నేతలు టచ్ చేశారు. రేపు వైఎస్సార్సీపీ సమావేశానికి 8వేలకుపైగా ప్రతినిధులు హాజరవుతున్నారు. ఎన్నికల నేపథ్యంలో రేపటి సమావేశానికి ప్రాముఖ్యత ఉంది. ఆరోగ్య సురక్ష ద్వారా పేదలందరికీ వైద్యం అందుతోందని ఆయన వెల్లడించారు.గత నాలుగున్నరేళ్లుగా ప్రభుత్వం వైపు నుంచి అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల(Welfare schemes)ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు గత ఏడాదిగా తమ ప్రజాప్రతినిధులు గడప గడపకు కార్యక్రమంలో ఇంటింటికీ తిరుగుతున్నారని సజ్జల వెల్లడించారు.