Andhrapradesh: షాకిచ్చిన కేంద్రం..వైఎస్ఆర్ పేరు ఉన్నందుకు రూ.5300 కోట్లు నిలిపివేత!
వైఎస్ఆర్ పేరు, ఏపీ లోగో వల్ల కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇవ్వాల్సిన రూ.5,300 కోట్ల నిధులను నిలిపివేసింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకానికి చివర్లో వైఎస్ఆర్ పేరు చేర్చడం ఏంటని సీఎం జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ తరుణంలో దీనిపై వివరణ కోరగా ఏపీ సమాధానమివ్వలేదు. దీంతో నిధులను నిలిపివేసినట్లు కేంద్రం వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) రాష్ట్రానికి రావాల్సిన రూ.5,300 కోట్లను కేంద్ర ఆర్థిక శాఖ నిలిపివేసింది. వైఎస్ఆర్ అనే మూడు అక్షరాల వల్ల ఆ నిధులను నిలిపివేసినట్లు తెలిపింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం (PMAY) పేరు చివర్లో వైఎస్ఆర్ (YSR)ను చేర్చడంతో పెద్ద మొత్తంలో నిధుల విడుదలను కేంద్రం ఆపేసింది. కేంద్రం నిధులు అందిస్తోన్న పథకం పేరుకు ఆఖర్లో వైఎస్ఆర్ పేరును ఎలా జత చేస్తారని కేంద్ర ఆర్థిక శాఖ ప్రశ్నించింది. దీనిపై ఏపీని వివరణ కోరింది. ఈ నేపథ్యంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి ఆగస్టు 8వ తేదిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఓ లేఖను రాశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆ లేఖకు బదులివ్వలేదు. దీంతో ఆగస్టు 30న మరోసారి గుర్తు చేస్తూ ఇంకో లేఖ రాశారు. అయినప్పటికీ ఏపీ సర్కార్ నుంచి సమాధానం రాలేదు. దీంతో నిధుల విడుదలను ఆపేసినట్లుగా కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్ వెల్లడించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. ఈ స్కీమ్ కింది దేశంలోని 2 కోట్ల కుటుంబాలకు ఇళ్లను నిర్మించి ఇవ్వాలన్నదే లక్ష్యంగా ఉంది. ఇదే సమయంలో 2024 మార్చిలోపు రాష్ట్రంలో 1.79 లక్షల ఇళ్లను నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో నిధులను కేటాయిస్తూ వస్తున్నాయి.
మరోవైపు 40 శాతం కంటే ఎక్కువ నిధులను తాము కేటాయిస్తున్నామని, అందుకే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం చివర్లో వైఎస్ఆర్ పేరును కూడా చేర్చుకుంటామని ఏపీ సర్కార్ గతంలో కేంద్రానికి లేఖను రాసింది. ఆ సమయంలో ఏపీ లేఖను కేంద్రం తోసిపుచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ లోగోను కూడా వేయడానికి వీల్లేదని కేంద్రం సూచించింది. ఎలాంటి మార్పులు చేసినా నిధులు నిలిపేస్తామని తేల్చి చెప్పింది.
కేంద్రం మార్గదర్శకాలను పాటించకుండా రాష్ట్రలోగో, వైఎస్ఆర్ పేరును చేర్చడంతో నిధుల విడుదల నిలిపివేసినట్లుగా కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి సోమనాథన్ వెల్లడించారు. పశ్చిమ బెంగాల్ సర్కార్ కూడా ఈ పథకాన్ని ‘బంగ్లా ఆవాస్ యోజన’ పేరుతో అమలు చేస్తుండంతో 2022 నుంచి ఆ రాష్ట్రానికి కేంద్రం నిధులను నిలిపివేసింది. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో మొత్తానికి వైఎస్ఆర్ పేరు, ఏపీ లోగోను తొలగించేందుకు ఏపీ సర్కార్ సిద్ధమైంది.