Chandrababu: కంటి ఆపరేషన్ పూర్తి..ఇంటికి చేరుకున్న చంద్రబాబు
హైదరాబాద్ లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో టీడీపీ అధినేత చంద్రబాబుకు కంటి శస్త్రచికిత్స పూర్తయ్యింది. అలాగే చర్మ సంబంధిత పరీక్షలు కూడా ఏఐజీ ఆస్పత్రిలో పూర్తయ్యాయి. ఆపరేషన్ తర్వాత ఆయన హైదరాబాద్ లోని తన ఇంటికి చేరుకున్నారు.
టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)కు కంటి ఆపరేషన్ పూర్తయ్యింది. హైదరాబాద్ లోని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో ఆయనకు కంటి శస్త్ర చికిత్స జరిగింది. దాదాపు రెండు గంటల పాటు ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి (LV Prasad Hospital) వైద్యులు ఆయన కంటికి శస్త్ర చికిత్స నిర్వహించినట్లు తెలిపారు. ప్రస్తుతం చంద్రబాబు అనారోగ్య కారణాల రీత్యా మధ్యంతర బెయిల్‌పై జైలు నుంచి బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జూన్ నెలలో బాబు ఎడమ కంటికి సర్జరీ జరిగింది. అయితే ఆ తర్వాత మూడు నెలలకు కుడి కంటికి సర్జరీ జరగాల్సి ఉంది.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆ కేసులో రిమాండ్‌పై బాబు జైలుకు వెళ్లడంతో కంటి వైద్యం వాయిదా పడింది. నేడు ఆ కంటికి ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి వైద్యులు ఆపరేషన్ చేశారు. సర్జరీ తర్వాత బాబు ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి నుంచి తన కాన్వాయ్‌లో ఇంటికి బయల్దేరారు. అంతకుముందు ఆయనకు ఏఐజీ ఆస్పత్రిలో చర్మ సంబంధిత పరీక్షలను వైద్యులు నిర్వహించారు.
బాబుకు ప్రస్తుతం 73 సంవత్సరాలు కాగా వయసురీత్యా ఆయన్ని అనేక అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయని వైద్యులు తెలిపారు. ఈ మేరకు ఓ నివేదికను కూడా అందించారు. బాబుకు అత్యవసరం చేయాల్సిన కంటి కాటరాక్ట్ ఆపరేషన్‌ను వైద్యులు పూర్తి చేసినట్లు తెలిపారు. ఇకపోతే బాబుకు చాలా ఏళ్లుగా చర్మ సంబంధిత సమస్యలు ఉండటంతో జైలులో ఉక్కపోత కారణంగా డీహైడ్రేషన్‌కు గురయ్యారు. దాని వల్ల బాబు వీపు, నడుము, ఛాతి, చేతులు, గడ్డం తదితర ప్రాంతాల్లో ఎర్రటి దద్దుర్లు వచ్చాయని, పొక్కులు ఏర్పడినట్లుగా జిజిహెచ్ చర్మ సంబంధిత వైద్య నిపుణులు వెల్లడించారు. వాటి వల్ల ఆయనకు తీవ్రమైన దురద ఉంటుందని అన్నారు.
రెండు అరచేతుల్లో చీమ పొక్కులు ఎక్కువయ్యాయని, శరీరం మొత్తంలో తెల్లటి పొక్కులు ఏర్పడినట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు చంద్రబాబుకు వెన్ను నొప్పి విపరీతంగా బాధిస్తోందని వైద్యులు కొన్ని పరీక్షలు చేపట్టారు. ఒకే పొజిషన్లో ఎక్కువసేపు కూర్చోవద్దని సూచించారు. అంతేకాకుండా చంద్రబాబు మలద్వారం వద్ద కూడా నొప్పితో బాధపడుతున్నట్లుగా వైద్యులు గుర్తించి పరీక్షలు చేపట్టారు. నడుం కింది భాగంలో కూడా నొప్పి ఉండటంతో కొన్ని మందులను వాడాలని వైద్యులు సూచించారు. బాబు సమస్యలు తగ్గడానికి మరికొంత కాలం పడుతుందని వైద్యులు వెల్లడించారు.