RK Roja: టూరిస్టా… టూరిజం మినిస్టరా అన్న వారికి ఇదే సమాధానం…
మంత్రి రోజా టూరిస్టా లేక టూరిజం మినిస్టరా అని తనను ఎగతాళి చేసిన వారికి ఇదే తన సమాధానం అని, విశాఖలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ ద్వారా టూరిజంలో రూ.21,941 కోట్ల పెట్టుబడులకు సంబంధించి 129 ఎంవోయూలు జరిగాయని మంత్రి రోజా చెప్పారు.
మంత్రి రోజా టూరిస్టా లేక టూరిజం మినిస్టరా అని తనను ఎగతాళి చేసిన వారికి ఇదే తన సమాధానం అని, విశాఖలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ ద్వారా టూరిజంలో రూ.21,941 కోట్ల పెట్టుబడులకు సంబంధించి 129 ఎంవోయూలు జరిగాయని మంత్రి రోజా చెప్పారు. విశాఖ సమ్మిట్ తో ముఖ్యమంత్రి, తమ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి బ్రాండ్ ఏమిటో అందరికీ అర్థం అవుతుందన్నారు. గతంలో ఇలాంటి సమ్మిట్ లు పేపర్ల కు మాత్రమే పరిమితం అయ్యాయని ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఈ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు వచ్చిన ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, దాల్మియా, ఒబెరాయ్, నవీన్ జిందాల్, జిఎమ్మార్ వంటి దిగ్గజ పారిశ్రామికవేత్తలను చూసి ప్రతిపక్షాలకు మైండ్ బ్లాక్ అయిందన్నారు. ఈ సదస్సుపై గోబెల్స్ ప్రచారం చేసిన వారికి ఇదో చెంప పెట్టు అన్నారు. ప్రతిపక్షాల దిగజారుడు రాజకీయాలు పక్కన పెట్టాలని, ఇప్పటికే రాష్ట్ర అభివృద్ధికి అందరూ ముందుకు వస్తున్నారనే విషయాన్ని గుర్తించాలన్నారు. MOU లు చేసుకున్న కంపెనీలు ఏడాదిలో మెజారిటీ గ్రౌండ్ అయ్యేలా చూస్తామని చెప్పారు. ఒక్క పర్యాటర రంగంలోనే 129 MOUలతో 21వేల 941 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయన్నారు. దీని ద్వారా 41 వేల మందికి పైగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు.
టూరిజం శాఖ కుదుర్చుకున్న ఒప్పందాల అమలు కోసం రెండు కమిటీలు వేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో పర్యాటక ప్రాజెక్టుల పనులు ఏడాదిలో ప్రారంభించేందుకు వీలుగా ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఏపీ పర్యాటాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో ఈ కమిటీలు వేస్తున్నట్లు చెప్పారు.
విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు విజయవంతం కావడంతో రోజా మంగళవారం కేక్ కట్ చేసి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ నెల 3, 4 తేదీల్లో జరిగిన ఈ సదస్సు గ్రాండ్ సక్సెస్ అయిందని, ఇందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. పర్యాటక రంగంలోను చాలామంది పెట్టుబడులకు ముందుకు వచ్చారన్నారు. జీఐఎస్ ద్వారా రాష్ట్రానికి 13.41 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. 352 ఎంవోయూలు జరిగాయన్నారు. వీటి ద్వారా 6 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రాబోతున్నాయన్నారు. టీడీపీ గోబెల్స్ ప్రచారానికి ఈ సదస్సుతో గట్టి సమాధానం ఇచ్చామన్నారు. దీని ద్వారా టూరిజంకు పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయన్నారు. ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధిలో దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు అంబానీ, అదానీలు భాగస్వాములు అవుతున్నారన్నారు. కరోనా మహమ్మారి లేకుంటే ఈ అభివృద్ధి ఎప్పుడో జరిగేదని, ఇప్పుడు సరైన సమయంలోనే ఇన్వెస్టర్స్ సదస్సు నిర్వహించామన్నారు.
శాప్ లో వేధింపులపై…
రాష్ట్ర క్రీడా ప్రాధికారిక సంస్థలో ఉద్యోగినులపై లైంగిక వేధింపులకు సంబంధించి వచ్చిన ఫిర్యాదుల మీద విచారణ జరుగుతోందని రోజా చెప్పారు. ఈ నివేదిక వచ్చాక బాధ్యుల పైన చర్యలు తీసుకుంటామన్నారు. అదే సమయంలో జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో ప్రతిభ కనబరిచిన రాష్ట్రానికి చెందిన ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేనిని… రోజా శాలువా కప్పి సన్మానించారు.