Chandrababu: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుకు ఊరట
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, అంగళ్లు కేసుకు సంబంధించి చంద్రబాబును సోమవారం వరకూ అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఐఆర్ఆర్ కేసులో ముందస్తు బెయిల్‌ను కూడా మంజూరు చేయడంతో చంద్రబాబుకు కాస్త ఊరట లభించినట్లైయ్యింది.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు (Amaravati Inner Ring Road Case)లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu naidu)కు తాత్కాలిక ఊరట లభించింది. చంద్రబాబుకు మధ్యంతర ముందస్తు బెయిల్ ఉత్తర్వులను కోర్టు మంజూరు చేసింది. పీటీ వారెంట్‌పై హైకోర్టు స్టే విధించింది. ఐఆర్ఆర్ కేసులో ఆయన్ని సోమవారం వరకూ అరెస్ట్ చేయొద్దంటూ కోర్టు సీఐడీ అధికారులను ఆదేశించింది. ఇప్పటికే చంద్రబాబు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.
స్కిల్ కేసులో విచారణలో భాగంగా చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఆ కేసు విచారణ కొనసాగుతుండగానే సీఐడీ అధికారులు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఆయనపై సిట్ దాఖలు చేశారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేశ్‌ను విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా నిన్న దాదాపుగా 50 ప్రశ్నలను సీఐడీ అధికారులు నారా లోకేశ్‌ను అడిగిన సంగతి తెలిసిందే.
నేడు ఐఆర్ఆర్ కేసులో విచారణ చేపట్టిన హైకోర్టు ఈ కేసుతో పాటుగా అంగళ్లు కేసుకు సంబంధించి కూడా చంద్రబాబును సోమవారం వరకూ అరెస్ట్ చేయొద్దంటూ అధికారులను ఆదేశించింది. దీంతో చంద్రబాబుకు కాస్త ఊరట లభించినట్లైయ్యింది. ఐఆర్ఆర్, అంగళ్లు కేసుకు సంబంధించిన పీటీ వారెంట్‌పై స్టే విధిస్తూ చంద్రబాబుకు ముందస్తు బెయిల్‌ను కూడా మంజూరు చేయడంతో టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ నాయకుడిపై తప్పుడు కేసులు పెట్టి వైసీపీ కక్ష సాధిస్తోందని, ఈ ఎన్నికల్లో వైసీపీకి ఓటమి తప్పదని టీడీపీ నేతలు అంటున్నారు.