తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. తాజాగా తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు రెండు కంపార్టుమెంట్లలో ఎదురుచూస్తున్నారు. టోకెన్లు లేని భక్తులకు మాత్రం దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక దర్శనం టికెట్లు గలవారికి 5 గంటల్లోనే దర్శనం పూర్తవుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 69,221 మంది దర్శించుకున్నారు. అలాగే 24,409 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.45 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
టీటీడీ పరిపాలన భవనంలో గురువారం గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. పరిపాలన భవనం వెనక వైపు పరేడ్ మైదానంలో టీటీడీ కార్యనిర్వహణాధికారి ఏవి ధర్మారెడ్డి ఉదయం 8.30 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అలాగే విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందించారు. టీటీడీ భద్రతా విభాగంలోని బెటాలియన్ల పరేడ్, విద్యాసంస్థల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ అలరించాయి.