ఆంధ్రప్రదేశ్ లో అక్రమ వసూళ్ల వ్యవహారంలో బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధిగా బహిరంగంగా తాను ఫిర్యాదు చేస్తున్నానని లోక్ సభ సభ్యులు రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఈ అంశంపై విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అధికారుల్లో రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరించేవారు ఎవరు ఉన్నారు, అలాగే బలవంతపు వసూళ్లకు సంబంధించి ఎవరు ఉన్నారు అనే అంశాలపై ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విచారణ జరిపిస్తామని చెప్పారు.
అలాకాకుండా ఈ అంశంపై ప్రస్తుత ప్రభుత్వమే విచారణ జరిపితే వాళ్ళకే మంచి పేరు వస్తుందని, లేదంటే ఎన్నికల తర్వాత వచ్చే కొత్త ప్రభుత్వం విచారణ చేపట్టి మంచి పేరు తెచ్చుకుంది అన్నారు. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తీసుకున్న మంచి నిర్ణయం ఏదైనా ఉంది అంటే అది సీఐడీ చీఫ్గా సునీల్ కుమార్ను తప్పించడమే అన్నారు. ప్రభుత్వానికి అధిపతి గవర్నర్ అని, అలాంటి గవర్నర్ను ఉద్యోగ సంఘాల నాయకుకు కలిస్తే తప్పేముందన్నారు. ప్రతి నెల వేతనాలు సరిగ్గా రానందున గవర్నర్ని కలిసి నెల నెల ఒకటో తేదీన జీతాలు ఇప్పించమని ఉద్యోగ సంఘాలు అడిగితే తప్పు లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు టిఏలు, డీఏల రూపంలో రూ.18 వేల కోట్ల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించవలసి ఉందని, ఇదే విషయాన్ని ఉద్యోగ సంఘాల నాయకులు చెప్పారని గుర్తు చేశారు. తమకు వచ్చే జీతాలను ఇప్పించమని అడగడంలో తప్పేం ఉందన్నారు. దానికి మరో ఉద్యోగ సంఘం నేతతో తిట్టించడం విడ్డూరం అన్నారు.
సర్వీస్ రూల్స్ కు విరుద్ధంగా వ్యవహరించారంటూ సంఘాన్ని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ నోటీసులు జారీ చేయడం హాస్యాస్పదం అన్నారు. దీనికి సంబంధించి సంఘం నేతలు కోర్టుకు వెళ్ళవచ్చు అన్నారు.