Pawan Kalyan:జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఏపీలో ఇళ్ల నిర్మాణం పేరిట భారీ కుంభకోణం జరిగిందని, దీనిపై సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని పవన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీకి పవన్ కల్యాణ్ 5 పేజీల లేఖ రాశారు. వైసీపీ పాలనలో అవినీతి జరుగుతోందని, భూ సేకరణ పేరిట రూ.32141 కోట్లు నిధులు దుర్వినియోగం చేశారని తెలిపారు. ఇళ్ల పట్టాలు, నిర్మాణంపై ప్రభుత్వం విభిన్న ప్రకటనలు చేస్తోందని తెలిపారు.
సీబీఐ వంటి సంస్థలతో దర్యాప్తు చేయాలని లేఖలో పేర్కొన్నారు. ఇలా చేయడం వల్ల నిజాలు తెలుస్తాయని తెలిపారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు భూ సేకరణలో కీలకంగా వ్యవహరించారు. గతంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను కూడా పూర్తిగా లబ్ధిదారులకు ఇవ్వలేదని తెలిపారు. 6.68 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తయితే 86,984 మందికి మాత్రమే ఇచ్చాని పవన్ పేర్కొన్నారు. ప్రభుత్వం తీరు సరిగ్గా లేదని పవన్ లేఖలో పేర్కొన్నారు.