వైజాగ్ ఫిషింగ్ హార్బర్లో బోట్లు దగ్ధమైన సంఘటన తెలిసిందే. ఈ ప్రమాదంలో దగ్దమైన బోట్ల బాధితులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. మరో రెండు మూడు రోజుల్లో తానే స్వయంగా బాధితుల వద్దకు వెళ్లి ఒక్కొక్కరికి రూ.50 వేల ఆర్థిక సాయాన్ని అందించనున్నట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh)లోని విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ (Vizag Fishing Harbour) వద్ద అగ్నిప్రమాదంలో బోట్లు దగ్ధమైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో బోట్లు నష్టపోయిన బాధితులకు 80 శాతం నష్టపరిహారాన్ని అందజేయనున్నట్లు ఏపీ సీఎం జగన్ (CM Jagan) నిన్న ప్రకటించారు. తాజాగా బోట్లు నష్టపోయిన బాధితులకు జనసేన పార్టీ (Janasena Party) అండగా నిలిచింది. బోట్లు నష్టపోయిన వారికి ఆర్థిక సాయాన్ని జనసేనాని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రకటించారు. ఈ ఘటనలో 60కి పైగా బోట్లు దగ్ధం కాగా, బాధిత మత్స్యకారులకు ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని పవన్ ప్రకటించారు.
ట్విట్టర్ వేదికగా ఆయన మత్స్యకారులకు ఆర్థిక సాయాన్ని ప్రకటిస్తున్నట్లు తెలిపారు. మరో రెండు మూడు రోజుల్లో బాధిత మత్స్యకారులను స్వయంగా కలిసి ఆర్థిక సాయాన్ని అందించనున్నట్లు పవన్ వెల్లడించారు. బాధిత కుటుంబాలకు జనసేన అండగా ఉంటుందని స్పష్టం చేశారు. మత్స్యకారులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, ఉపాధి లేకపోవడంతో వలసలు వెళ్తున్నారని, ఇదంతా కూడా ప్రభుత్వ వైఫల్యం వల్లే జరుగుతోందని పవర్ ఆరోపించారు.
వైజాగ్ ఫిషింగ్ హార్బర్ (Vizag Fishing Harbour) లో ఓ బోటులో మంటలు అంటుకున్నాయి. ఆ సమయంలో ఆ మంటలు మిగిలిన బోట్లకు వ్యాపించడంతో 60కి పైగా బోట్లు దగ్ధమైన సంగతి తెలిసిందే. అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపడుతున్నారు. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం తప్పా ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు వెల్లడించింది.