ప్రకాశం: పీసీపల్లి మండలం దివాకరపురంలో రిలయన్స్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ పీ. రాజాబాబు ఆదేశించారు. గురువారం ఆయన ప్లాంట్ భూమిని పరిశీలించి, రిలయన్స్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్లాంట్ నిర్మాణ పురోగతి, కేటాయించిన భూముల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్లాంట్ నిర్మాణం పూర్తయితే స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు ఉంటాయని తెలిపారు.
VSP: విశాఖ జీవీఎంసీ ఆధ్వర్యంలో నగరంలో జరుగుతున్న ‘ఆపరేషన్ లంగ్స్ 2.0’ ఆక్రమణల తొలగింపు డ్రైవ్‌కు దసరా పండుగ సందర్భంగా తాత్కాలికంగా విరామం ఇస్తున్నట్లు జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ ఏ. ప్రభాకర రావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ విరామ సమయంలో ఆక్రమణదారులు స్వయంగా తమ దుకాణాలు, బడ్డీలు తొలగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
విజయవాడ: దసరా నవరాత్రులలో 4వ రోజు కాత్యాయనీ దేవిగా దర్శనమిస్తున్న అమ్మవారికి శ్రీశైలం, అన్నవరం దేవస్థానాల నుంచి పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీనివాస్ వేదపండితులతో కలసి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
GNTR: చిరకాలంగా తాము ఎదురు చూస్తున్న మెగా DSC నియామక పత్రాలు అందుకోవడానికి గురువారం వెలగపూడి వచ్చిన అభ్యర్థుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆనందం వ్యక్తపరిచారు. DSC నియామక పత్రాలను అందుకోవడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. తమకు నియామక పత్రాలు అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
GNTR: తిరుపతి దేవస్థానానికి నెయ్యి పంపిణీ చేయడం హర్షణీయం అని సంగం డెయిరీ ఛైర్మన్, MLA ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అధిక భక్తులున్న శ్రీవారి ప్రసాదంలో సంగం నెయ్యి ఉపయోగించే అరుదైన అవకాశాన్ని పొందటం జిల్లా రైతులు, ప్రజల ఆత్మగౌరవంగా భావిస్తున్నామన్నారు. వడ్లమూడి సంగం డెయిరీలో గురువారం టీటీడీకి పంపనున్న వాహనాన్ని ప్రారంభించారు.
ATP: స్పిక్ కంపెనీకి చెందిన 756.315 మెట్రిక్ టన్నుల యూరియా, 586 మెట్రిక్ టన్నుల 20-20-0-13, 113.6 మెట్రిక్ టన్నులు 10-26-26 రకం కాంప్లెక్స్ ఎరువులు జిల్లాకు చేరినట్లు రేక్ ఆఫీసర్, ఏడీఏ అల్తాఫ్ అలీఖాన్ తెలిపారు. స్థానిక ప్రసన్నాయపల్లి రైల్వే స్టేషన్‌క వ్యాగన్ల ద్వారా గురువారం చేరిన యూరియాను ఆయన పరిశీలించారు.
GNTR: జిల్లాలోని ప్రభుత్వ ITI కళాశాలల్లో 4వ విడత ప్రవేశాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సహాయ సంచాలకుడు ప్రసాద్ గురువారం తెలిపారు. అభ్యర్థులు ఈ నెల 27లోపు తమ పేర్లు iti.ap.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలన్నారు. 10వ తరగతి మెమో తదితర పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
VSP: విశాఖ జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించ కపోవడంతో శుక్రవారం నుంచి విధులు బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు. ఏపీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నఆందోళనలో 10 పీహెచ్‌సీలకు చెందిన సుమారు 20 మంది వైద్యులు పాల్గొంటున్నారని అసోసియేషన్ నాయకుడు డాక్టర్ జగదీష్ తెలిపారు.
WG: తణుకుతో పాటు రూరల్ తేతలి, పైడిపర్రు, వేల్పూరు, అత్తిలి, కొమ్మర సబ్ స్టేషన్ల పరిధిలో లైన్లు మరమతుల నిమిత్తం శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు డీఈ నరసింహమూర్తి తెలిపారు. తణుకులోని ఇరగవరం కాలనీతోపాటు తేతలి ఇండస్ట్రియల్ ఏరియా, మండపాక, పైడిపర్రు గ్రామాలకు అత్తిలి, ఇరగవరం మండలాల్లో సరఫరా ఉండదన్నారు.
AKP: ఎస్పీ బాలసుబ్రమణ్యం వర్ధంతి సందర్భంగా ఎలమంచిలిలో ఈనెల 28న సినీ సంగీత విభావరి నిర్వహిస్తున్నట్లు నిర్వాహకుడు ఎం రామారావు తెలిపారు. స్థానిక గుర్రప్ప కళ్యాణ మండపంలో సాయంత్రం మూడు గంటలకు సంగీత విభావరి ప్రారంభం అవుతుందన్నారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆలపించిన గీతాలను పలువురు గాయకులు ఆలపిస్తారన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
KDP: రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(RGUKT) పరిధిలోని ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం IIIT విద్యార్థులకు ఈ నెల 28 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు వర్సిటీ యంత్రాంగం దసరా సెలవులు ప్రకటించింది. ఈ మేరకు ఆయా క్యాంపసుల నుంచి విద్యార్థులు పండగ సెలవుల కోసం స్వగ్రామాలకు తరలి వెళ్ళనున్నారు.
NDL: బనగానపల్లె మండలం నందవరం గ్రామంలో శుక్రవారం దేవి శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో ఐదవరోజు స్కందమాత అలంకారణలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. అమ్మవారిని ప్రత్యేక పూలమాలతో అలంకరించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అర్చకులు తీర్థప్రసాదాలను అందజేశారు.
సత్యసాయి: ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి యూరప్ యాత్రకు వెళ్లారు. తన స్నేహితులతో కలిసి బుడాపెస్ట్ దేశంలో పర్యటించారు. డానుబే నది, ముత్యం వంతెనలపై నిలబడి ఫోటోలు దిగారు. ప్రపంచాన్ని అన్వేషించడం అంటే కేవలం ప్రదేశాల గురించి మాత్రమే కాదని, అది మీతో ఎప్పటికీ నిలిచి ఉండే అనుభూతుల గురించి అని ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
CTR: ప్రతి రైతు ఈ నెలాఖరుకు ఈ-పంటను నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి మురశ్రీకృష్ణ అన్నారు. గురువారం మండలంలోని ఏఎలప్పురం, కమ్మతిమ్మయ్యపల్లె, గుడిపాల పంచాయతీల్లోని పంటలను పరిశీలించారు. వేరుసెనగ పంటను పరిశీలించి రైతులకు తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారులు, సచివాలయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
ప్రకాశం: ఒంగోలులోని మామిడిపాలెంలో ఉన్న ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ రాజా బాబు గురువారం తనిఖీ చేశారు. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి గోడౌన్‌ను పరిశీలించారు. భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిరంతరం పట్టిష్టమైన భద్రత ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.