సత్యసాయి: పెనుకొండలోని సీపీఐ కాలనీలో ‘ఆపరేషన్ వజ్రపహార్’ కింద పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్బంగా డ్రోన్ కెమెరా సహాయంతో గంజాయి రహిత గ్రామంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో అనుమానిత వ్యక్తుల యొక్క ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ నర్సింగప్ప, సీఐ రాఘవన్, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు వాతావరణ శాఖ ఇవాళ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. గంటకు 50 నుంచి 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షాల ఉద్ధృతి పెరిగే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు.
NLR: విడవలూరులోని వావిల్ల రోడ్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. లారీలు, గోన సంచుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతులకు అధికారులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు.
E.G: జిల్లాలోని రాజమండ్రి కలెక్టర్ కార్యాలయంలో ఈ నెల 23న పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ప్రజలు తమ అర్జీలను Meekosam.ap.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అలాగే అర్జీల స్థితి, నమోదు వివరాల కోసం 1100కు కాల్ చేయవచ్చని వెల్లడించారు.
విశాఖలో గంజాయి, ఇతర నార్కోటిక్ డ్రగ్ కట్టడిలో భాగంగా RTC కాంప్లెక్స్, రైల్వే స్టేషన్, బీచ్ రోడ్, తదితర ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్ బృందాలు నిఘా చేపట్టాయి. శనివారం జ్ఞానాపురం రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో 2 కేజీల గంజాయిని గుర్తించారు. గంజాయిని స్వాధీనం చేసుకొని, ఇద్దరిని తదుపరి చర్యలకై కంచరపాలెం పోలీసులకు అప్పగించారు.
ELR: ద్విచక్ర వాహన చోదకులు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండడంతో పాటు, అదెప్పుడు ద్విచక్ర వాహనంలో అందుబాటులో ఉండాలని పెదపాడు ఎస్సై శ్రీను అన్నారు. పెదపాడులో శనివారం రాత్రి సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహించారు. హెల్మెట్ ధరించని డ్రైవింగ్ లైసెన్స్ లేని వారిని గుర్తించి కౌన్సెలింగ్ నిర్వహించారు. రహదారి పైకి వచ్చే క్రమంలో అన్ని పత్రాలు దగ్గర ఉంచుకోవాలన్నారు.
కోనసీమ: వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నిత్యాన్నదాన ట్రస్ట్‌కు ఆదివారం రాజమండ్రికు చెందిన హనుమంశెట్టి దుర్గాప్రసాద్ దంపతులు రూ.70,001, వానపల్లికి చెందిన కర్రీ రామారెడ్డి దంపతులు రూ.25,116లు విరాళంగా ఆలయ డీసీ చక్రధరరావుకు అందజేశారు. ముందుగా వారు స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం అధికారులు స్వామి వారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు.
ATP: కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్య ఆదివారం కంబదూరు మండలంలో పర్యటిస్తారని పార్టీ కార్యాలయ ప్రతి నిధులు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్డీటీ పరిరక్షణ కోసం ఎర్రబండ గ్రామంలో వైసీపీ చేపట్టిన లక్ష పోస్టుకార్డుల ఉద్యమంలో పాల్గొంటారన్నారు. పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
పల్నాడు: వరికపూడిశెల ప్రాజెక్టు నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని కోరుతూ ఆదివారం వెల్దుర్తి మండల ప్రజలు ఒకరోజు ఐక్య నిరాహార దీక్ష చేపట్టనున్నారు. జీవో నంబర్ 104 ప్రకారం ప్రాజెక్టుకు సంబంధించి 25 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తున్నారు. మండలంలోని ప్రజలు ఎవరికి వారు వారి సొంత గృహంలోనే నిరాహార దీక్ష చేపట్టాలని వరికపూడిశెల జేఏసీ పిలుపునిచ్చింది.
BPT: మార్టూరు మండలం కోనంకి గ్రామానికి చెందిన రాకేష్ కుమార్ అమెరికాలోని జఫర్సన్ ఐన్‌స్టీన్ మెడికల్ యూనివర్సిటీలో ఇంటర్నల్ మెడిసిన్ MD సీటు సాధించాడు. సంవత్సరానికి సుమారు రూ. 85 లక్షల స్టైఫండ్ పొందనున్నాడు. ఈ ఏడాది రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఈ స్థాయి సీటు దక్కించుకున్న ఏకైక విద్యార్థిగా నిలిచాడు.
NDL: శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి విదేశీ, ఎన్ఆర్ఐ భక్తుల సంఖ్య పెరుగుతోంది. శనివారం లెక్కింపులో అత్యధిక సంఖ్యలో విదేశీ కరెన్సీ రావడమే అందుకు నిదర్శనం. 624 USA డాలర్లు, 210 UAE దిర్హమ్స్, 10 సింగపూర్ డాలర్స్, 20 ఇంగ్లాండ్ పౌండ్స్, 25 ఆస్ట్రేలియా డాలర్లు, 70 యూరోలు, కువైట్ దినార్లు, కెనడా, న్యూజిలాండ్ డాలర్లు వచ్చాయని అధికారులు వివరించారు.
ELR: అకాల వర్షాల కారణంగా జిల్లాలోని పొగాకు రైతులకు భారీ నష్టం వాటిల్లింది. కోత దశకు వచ్చిన పంట దెబ్బతిని చాపలా మారిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనేక రోజుల పాటు కష్టపడి సాగు చేసిన పంట ఒక్కసారిగా నష్టపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కుంటామని ఆందోళన చెందుతున్నారు. పెట్టుబడులు తిరిగి రావని దిగులు చెందుతున్నారు.
కృష్ణా: పమిడిముక్కల మండలం వేల్పూరులో టీడీపీ నాయకుడు చీకుర్తి ఏసుబాబు మరణం స్థానికంగా విషాదాన్ని నింపింది. పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా గ్రామానికి చేరుకుని ఆయన మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. కూటమి నాయకులు, స్థానిక కార్యకర్తలు మృతునికి శ్రద్ధాంజలి ఘటించారు.
TPT: నాగలాపురం మండలంలోని వేదనారాయణ స్వామి ఆలయంలో మత్స్య జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించబడ్డాయి. నిన్న ఉదయం ప్రత్యేక పూజలు, మహాశాంతి హోమం నిర్వహించి, సాయంత్రం గరుడవాహనంపై స్వామివారి తిరువీధి ఉత్సవం చేపట్టారు. మత్స్యకారులు ఇరుముడులతో పాల్గొని భక్తి చాటగా, భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.
GNTR: జిల్లాలో ఆదివారం మాంసం ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. చికెన్ ధరలు పెరగడంతో మాంసాహార ప్రియులు చేపల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో స్కిన్‌లెస్ కేజీ చికెన్ ధర రూ. 320 ఉండగా, విత్ స్కిన్ రూ. 300 పలుకుతోంది. కేజీ మటన్ ధర రూ. 960 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఇక చేపల విషయానికొస్తే.. కొరమేను రూ. 430, బొచ్చెలు రూ. 230లుగా ఉన్నాయి.