KDP: ఖాజీపేటలో ఆదివారం సాయంత్రం RSS ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టనున్నట్లు నిర్వహకులు హరినాధ్ రెడ్డి తెలిపారు. మైదుకూరు రోడ్డులోని రెయిన్‌బో పాఠశాల నుంచి ర్యాలీ మొదలై టీచర్స్ కాలనీ, బీచావారిపల్లి సర్కిల్, అమ్మవారి శాల మీదుగా బస్టాండ్ కూడలి వరకు, అక్కడి నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగుతుందన్నారు.
VSP: వేసవిలో నీటిని పొదుపుగా వాడాలని కమిషనర్ కేతన్ గార్గ్ సూచించారు. ప్రస్తుతం విశాఖకు రోజుకు 400 MLD నీటి అవసరం ఉండగా, 2047 నాటికి 726 MLDకు పెరుగుతుందన్నారు. నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ప్రజలు జాగ్రత్తగా నీటిని వినియోగించాలని సూచించారు. భవిష్యత్ అవసరాల కోసం నీటి వనరులను కాపాడుకోవాలని తెలిపారు.
SKLM: నగరంలోని మండలి వీధిలో నివాసం ఉంటున్న టీడీపీ కార్యకర్త మోహన్ కృష్ణ మరణం టిడిపికి తీరని లోటుఅని నరసన్నపేట ఎమ్మెల్యే రమణమూర్తి అన్నారు. శనివారం రాత్రి మోహనకృష్ణ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు. తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పార్టీ తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించారు.
NLR: జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. శనివారం రాత్రి ఒంగోలు నుంచి భీమవరానికి బైక్‌పై వస్తున్న ఉలవపాడు మండలం భీమవరం గ్రామానికి చెందిన సురేశ్ అనే యువకుడు పాలేరు బ్రిడ్జి సమీపంలో అదుపుతప్పి కింద పడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ అతడిని స్థానికులు గుర్తించి అంబులెన్స్‌లో ఒంగోలు ఆసుపత్రికి తరలించారు.
KRNL: ఆదోనిలోని గౌలిపేట కిందిగేరిలో ఇటీవల గాయపడిన బోయ రామును ఎమ్మెల్యే పార్థసారథి వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ.. నిరపరాధులపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. యువత అనవసర గొడవలకు దూరంగా ఉండాలని సూచించారు. చిన్న గొడవలు పెద్ద సమస్యలుగా మారి కుటుంబాలకు ఇబ్బందులు కలిగిస్తాయని ఎమ్మెల్యే తెలిపారు.
VSP: హార్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతల ప్రభావంతో విశాఖకు ఈ నెల 21న రావాల్సిన గ్యాస్ నౌక 26న చేరనుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గ్యాస్ కొరత నేపథ్యంలో కేంద్రం కేటాయించిన 2800 కిలోలీటర్ల కిరోసిన్‌ను వచ్చే సోమవారం నుంచి గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో రేషన్ ద్వారా లీటరు చొప్పున పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.
GNTR: పొన్నూరు మండలం ములుకుదురులోని శ్రీ చెన్నకేశవస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల గోడ పత్రికలను ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్ దాసరి సింగయ్య శనివారం విడుదల చేశారు. మార్చి 29 నుంచి ఏప్రిల్ 6 వరకు ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు.
SKLM: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ MLC గాదె శ్రీనివాసులు నాయుడు అన్నారు. శనివారం శ్రీకాకుళంలోని PRTU కార్యాలయంలో ఉపాధ్యాయుల కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మెమో 57 అమలు, పీఆర్సీ కమిటీ వేసి 30 శాతం ఐఆర్ ప్రకటించాలని కోరుతూ పలు తీర్మానాలు చేశారు.
E.G: రాజమండ్రిలో ఆదివారం మాంసం ధరలు భారీగా పెరిగాయి. రవాణా ఖర్చులు, కోళ్ల దాణా రేట్లు పెరగడంతో చికెన్ స్కిన్‌లెస్ కిలో రూ.380, స్కిన్‌తో రూ. 360కు చేరింది. లైవ్ కోడి రూ.230కు విక్రయిస్తున్నారు. మరోవైపు మటన్ ధర కిలో రూ.1100కు చేరడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. పెరిగిన ధరలతో మాంసం కొనలేని పరిస్థితి ఏర్పడిందని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
VZM: మార్చి 27న శ్రీరామనవమి సందర్భంగా రామతీర్ధం శ్రీ సీతారామస్వామి ఆలయంలో జరిగే సీతారాముల కళ్యాణోత్సవానికి ఉత్తరాంధ్ర భక్తులు తరలిరావాలని ఆలయ ఈవో వై.శ్రీనివాసరావు శనివారం కోరారు. కళ్యాణంలో పాల్గొనాలనుకునే దంపతులు రూ.1500 టికెట్ కొనుగోలు చేయాలని తెలిపారు. ఆన్‌లైన్‌లో ఆలయం వద్ద టికెట్లు లభ్యమవుతాయని పాల్గొనే వారికి శేషవస్త్రాలు, ప్రసాదం అందిస్తామన్నారు.
NDL: బనగానపల్లె మండలం నందవరం శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయంలో ఇవాళ అమ్మవారు ప్రత్యేక పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈవో శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు రుద్రాభిషేకం, మహా మంగళహారతి వంటి పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు క్యూలైన్లలో నిల్చొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
BPT: పర్చూరు మండలం నూతలపాడులో గ్రామాభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయి. ఎస్సీ కాలనీలో రూ.5 లక్షల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణానికి పీఎసీఎస్ ఛైర్మన్ విన్నకోట సతీశ్, స్థానిక నేతలు శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మద్దతుతో గ్రామంలో రహదారి సౌకర్యాలు మెరుగుపర్చే దిశగా ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు.
KRNL: ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి కల్తీ టీ పొడి విక్రయాలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మార్కెట్‌లో నకిలీ టీ విస్తృతంగా అమ్ముడవుతోందని పేర్కొన్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు తరచూ తనిఖీలు చేయాలని ఎమ్మెల్యే వెల్లడించారు. అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
KDP: ప్రొద్దుటూరు మండల పరిధిలోని చౌడూరు పెన్నానది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో దాడులు చేసినట్లు గ్రామీణ ఠాణా సీఐ నాగభూషణ్ తెలిపారు. మొత్తం 5 ట్రాక్టర్లను పట్టుకుని కేసు నమోదు చేసినట్లు వివరించారు. అనుమతి లేనిచోట అక్రమంగా తవ్వకాలు చేసి ఇసుకను తరలిస్తే కేసులు నమోదు చేస్తామని సీఐ హెచ్చరించారు.
అన్నమయ్య: రాయచోటి బైపాస్ వద్ద శనివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. లక్కిరెడ్డిపల్లి నుంచి వస్తున్న స్కార్పియో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో వాహనంలో ప్రయాణిస్తున్న ఆరుగురికి గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు వెంటనే స్పందించి గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.