KRNL: బనవాసి బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశ పరీక్ష కోసం ఈ నెల 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ రాజిత ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ఎంపీసీలో 60, బైపీసీలో 40, ఎంఈసీలో 30 సీట్లు ఉన్నాయని తెలిపారు.
BPT: సంతమాగులూరు శాఖ గ్రంథాలయంలో ఇవాళ విద్యార్థులకు చదువుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. లైబ్రేరియన్ విజయభాస్కర్‌రెడ్డి గ్రంథాలయాల ఉపయోగాన్ని వివరించి, నిత్యం చదవడం అలవాటు చేసుకోవాలని సూచించారు. పుస్తక పఠనం ద్వారా విజ్ఞానం పెరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.
NLR: వింజమూరు మండలం ఏ కిస్తీపురం పంచాయతీ నూతన భవనాన్ని ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ ప్రారంభించారు. రూ. 32లక్షలతో భవన నిర్మాణం పూర్తి చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాలనాపరంగా వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని కోరారు. పంచాయతీ భవనం ఏర్పాటుకు 5 సెంట్ల భూమిని ఉచితంగా అందించిన లక్కు వెంకటేశ్వరరెడ్డిని ఆయన సత్కరించారు.
KRNL: దేవనకొండ మండలం కుంకునూరు రెవెన్యూ చుట్టుపక్కల రేపు 9 గంటలకు రీ సర్వే చేయనట్లు రెవెన్యూ శాఖ పేర్కొంది. రైతులు వారి పొలంలో ఉండి భూముల హద్దులు చూపించుకోవాలని అధికారులు పేర్కొన్నారు. పొలం పాస్ బుక్, ఆధార్ కార్డు, రిజిస్టర్ డాక్యుమెంట్, బ్యాంకు ఖాతా తీసుకుని రావాలని తెలిపారు.
KRNL: మార్చి 28, 29వ తేదీలలో ఆలూరులో జరుగనున్న 21వ ఏఐటీయూసీ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని సీపీఐ దేవనకొండ మండల కార్యదర్శి నరసరావు పేర్కొన్నారు. కార్మికులందరూ సంఘటితంగా పోరాడి తమ హక్కులు సాధించుకునేందుకు గాను తలపెట్టిన ఈ మహాసభల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్మిక సమస్యలపై చర్చలు జరిపి దిశానిర్దేశం చేస్తారన్నారు.
పార్వతీపురం జిల్లాలో డిమాండుకి సరిపడా LPG గ్యాస్ సరఫరా జరుగుతోందని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. గృహ వినియోగదారులకు గ్యాస్ కొరత లేదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అవసరం మేరకే గ్యాస్ బుక్ చేసుకోవాలన్నారు. వదంతులు నమ్మి అనవసరంగా నిల్వలు చేయొద్దని, దానివల్ల కృత్రిమ కొరత ఏర్పడుతుందన్నారు.
TPT: సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 30న నాయుడుపేట పర్యటనకు రానున్నారు. బిరదవాడ సమీపంలోని టిడ్కో గృహ సముదాయాలను ప్రారంభించి, లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ పట్టాలు అందజేయనున్నారు. పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ, జేసీ గోవిందరావుతో కలిసి అధికారులు పరిశీలించారు. పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
సత్యసాయి: ఉదయగిరిలోని MPDO నూతన భవనం సోమవారం ఉదయం 10 గంటలకు పునః ప్రారంభిస్తున్నట్లు MPP మూలే పద్మజ వినయ్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటన తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, జడ్పీ చైర్మన్ ఆనం అరుణమ్మ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్లు చెప్పారు. జడ్పీ, మండల నిధులతో పాటు MPP సొంత నిధులతో ఈ భవన నిర్మాణం నూతన హంగులతో ఏర్పాటు చేశారు.
E.G: రాజమండ్రి రూరల్ MLA గోరంట్ల బుచ్చియ చౌదరి మద్దుకూరి సుధీర్ కుటుంబాన్ని పరామర్శించారు. ఆకస్మికంగా మృతి చెందిన సుధీర్ చిత్రపటానికి నివాళు అర్పించారు. ఎమ్మెల్యే స్థానిక సొసైటీ బీమా నుంచి మంజూరైన రూ.25 వేల చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు. పార్టీ కార్యకర్త కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో APTDC వాసిరెడ్డి రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.
KKD: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి జవాబు పత్రాల మూల్యాంకనం (స్పాట్ వాల్యుయేషన్) ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. ఏప్రిల్ 12 వరకు ప్రక్రియ సాగనుంది. ఇందుకు సంబంధించి కాకినాడ పీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే వేర్వేరు జిల్లాలకు చెందిన జవాబు పత్రాలను కాకినాడుకు చేర్చారు.
PLD: మాచవరం మండల CPM కార్యదర్శి, సీనియర్ కమ్యూనిస్టు నాయకులు బ్రహ్మనాయుడు ఆదివారం అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. పార్టీలో కొనసాగుతూ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడిన నాయకుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. బ్రహ్మనాయుడు మృతి పార్టీకి తీరని లోటని CPM జిల్లా కార్యదర్శి గోపాలరావు, CITU కార్య దర్శి శ్రీనివాసరావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
AKP: దొండపూడి చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో రెండు బ్యాగులతో గంజాయి తరలిస్తున్న ఇద్దరు అనుమానితులు కనిపించారు. పోలీసులను చూసి బ్యాగులు వదిలి పారిపోవడంతో శనివారం ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. బ్యాగుల్లో 22 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. నిందితులు నెల్లూరు జిల్లా నాయుడుపేటకు చెందినవారని పోలీసులు తెలిపారు.
W.G: రాష్ట్రంలో తొలిసారిగా బలుసులమ్మ వారి ఉగాది ఉత్సవ జాతర 5కిలో మీటర్ల మేర రెండు వేల మంది కళాకారులతో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేలమంది మహిళలు పాల్గొన్నారు. గ్రామ పొలిమేరల వరకు ఊరేగింపు సాగింది. వీధులన్ని జానాలతో కిక్కిరిసిపోయింది. ఈ కార్యక్రమం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్‌లో నమోదయ్యింది. బాణాసంచాతో రాజస్థానీ నృత్యాలు చేశారు.
CTR: పూతలపట్టు(M), పి.కొత్తకోట సమీపంలో ఇవాళ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. తిరుమల దర్శనానికి వెళ్తున్న కర్ణాటక రాష్ట్రం మండ్యకు చెందిన కుటుంబం ప్రయాణిస్తున్న కారు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సతీష్ (50), భాగ్యలక్ష్మి(45)అక్కడికక్కడే మృతి చెందగా, శశాంక్(23), పావని (10), మహాలక్ష్మీ(12), తుషార (4)లకు తీవ్ర గాయాలయ్యాయి.