VZM: రాజాం మండలం అంతకాపల్లి గ్రామంలో జరుగుతున్న మజ్జి గౌరీ యాత్రను ఆదివారం రాజాం SHO అశోక్ కుమార్ పర్యవేక్షించారు. యాత్రలో ఎటువంటి ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాల దగ్గర, అమ్మవారి గుడి వద్ద భద్రతను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై మూర్తి, పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు.
KKD: ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న వీర రాఘవులు ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 40 సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా పనిచేసి ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం కృషి చేశానన్నారు. ఎమ్మెల్సీగా తనను గెలిపిస్తే నిత్యం ప్రజలు, గ్రాడ్యుయేట్లు, బాధితుల పక్షాన అండగా నిలబడి పోరాటం చేస్తానని పేర్కొన్నారు.
కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామివారిని ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి వివిధ సేవల ద్వారా రూ. 3,18,218 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 795 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే, అన్న ప్రసాద ట్రస్ట్ ద్వారా 4,190 మంది భక్తులు అన్నదానం స్వీకరించారని వెల్లడించారు.
కోనసీమ: కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతోమందికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు సూక్ష్మ,చిన్న, మధ్యతరగతి పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నారని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. మండపేట మండలం మారేడుబాకలో మహిఎంటర్ ప్రైజెస్, ఆద్విక డెకర్స్ పరిశ్రమను ఆదివారం MLA వేగుళ్ల జోగేశ్వరరావుతో కలిసి ఆయన ప్రారంభించారు.
గుంటూరు: కలెక్టరేట్ కార్యాలయంలో 0863-2241029తో కంట్రోల్ రూమ్‌ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ నాగలక్ష్మీ ఆదివారం తెలిపారు. గుంటూరు-కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో 24 గంటలూ కంట్రోల్ రూమ్ సేవలు అందిస్తుందని అన్నారు. ఎన్నికలపై ఫిర్యాదు చేయడంతో పాటు ఇతర సమాచారాన్ని తెలుసుకోవడానికి కంట్రోల్ రూమ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
కోనసీమ: వరుస విపత్తులతో విలవిల్లాడుతున్న రైతన్నకు పాలకులు దన్నుగా నిలవడం లేదు. అయినవిల్లి మండలంలో సుమారు ఎనిమిది వేల హెక్టార్లలో వరి పంటను సాగు చేస్తున్నారు. సాగు నీరందక పొలాలు బీటలు వారుతున్నాయి. దీంతో వరి సాగు చేసిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని రైతులు గగ్గోలు పెడుతున్నారు.దీనిపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
కోనసీమ: ఈనెల 10న జరగాల్సిన గీత కులాల మద్యం షాపుల ఎంపిక ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున వాయిదా పడిందని ఎక్సైజ్ సీఐ ఐ.డి. నాగేశ్వరావు అన్నారు. ఆలమూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ డివిజన్ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. దరఖాస్తుదారులు గమనించి, తదుపరి తేదీ ప్రకటించే వరకు వేచి ఉండాలని ఆయన కోరారు.
TPT: చిల్లకూరు మండలం కలవకొండ గ్రామంలో జరుగుతున్న చిల్లకూరు మండలం సీనియర్ క్రికెట్ టోర్నమెంట్ పోటీలను గూడూరు ఎమ్మెల్యే పి. సునీల్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మండల క్రికెట్ అసోసియేషన్ అభివృద్ధి కొరకు రూ. 50,000 విరాళాన్ని ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ… గ్రామీణ యువత క్రీడల్లో రాణించాలని ప్రధానంగా క్రికెట్‌పై ఆసక్తి కనబరచాలన్నారు.
CTR: వెదురుకుప్పం మండలంలోని పాత గుంటలో పశువుల పండగను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పశువులను సర్వాంగ సుందరంగా అలంకరించారు. జల్లికట్టులో యువత పశువులను పట్టుకునేందుకు పోటీపడ్డారు. దీనిని తిలకించేందుకు సమీప ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.
E.G: నల్లజర్ల మండలంలోని పలు గ్రామాలకు రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని ఈఈ నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ తీగల మరమ్మత్తుల కారణంగా మండల పరిధిలోని దుబచర్ల, ఘంటావారి గూడెం గ్రామాల్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
VZM: తూర్పు భాగవతంపై వేసవి ఉచిత శిక్షణా తరగతులు మార్చి 15 నుంచి నిర్వహించనున్నట్లు తూర్పు భాగవతం కళాకారుడు బి.శంకరరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బొబ్బిలి మండలం కోమటిపల్లిలో ఉచిత శిక్షణా తరగతులు నిర్వహిస్తామని, ఆసక్తి ఉన్న వారు శిక్షణా తరగతులకు హాజరు కావాలని కోరారు. కళాకారులను ప్రోత్సహించేందుకు శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
VZM: రేగిడి మండలం రేగిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధి గ్రామాల్లో ఈనెల 10న డీ వార్మింగ్ నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారి డా.అసిరినాయుడు ఆదివారం తెలిపారు. ఫిబ్రవరి 10 నుంచి అంగన్వాడీ, పాఠశాల, కళాశాలల్లో విద్యార్థులకు డీవార్మింగ్ మాత్రలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. 2 ఏళ్ల లోపు పిల్లలు అర మాత్ర, 3-19 ఏళ్ల వాళ్లు ఒక మాత్ర వాడాలన్నారు.
W.G: క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని ఇస్తాయని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తపన చౌదరి అన్నారు. వచ్చే నెలలో ఏలూరులో జరిగే స్నేహం మెమోరియల్ క్రికెట్ క్లబ్ వారి కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మిత్రుల పేరు మీద క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్న నిర్వాహకుల దృక్పథం అభినందనీయమని తపన చౌదరి పేర్కొన్నారు.
VZM: వేపాడలోని విక్టరీ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ఆదివారం దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఆధ్వర్యంలో హిందీ పరిచయ మరియు ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షకు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. పాఠశాల అడ్మిన్ డైరెక్టర్ రాఘవ మాట్లాడుతూ.. ఈ పరీక్షలు హిందీ భాష నేర్చుకోవడానికి అలాగే హిందీ పండిట్ కావడానికి ఎంతగానో దోహదపడతాయని తెలిపారు.
ASR: ఈనెల 11, 12వ తేదీల్లో జరగనున్న మన్యం బందును జయప్రదం చేయాలని గిరిజన సంఘ నాయకులు సూర్యనారాయణ పోతురాజు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా డుంబ్రిగుడలో ఆదివారం కరపత్రాలు విస్తృతంగా పంచారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఆదివాసిల 1/70 చట్టాన్ని సవరించాలని రాష్ట్ర స్పీకర్ అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు.