AKP: పరవాడ మండలం గొర్లివానిపాలెం టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా బైలపూడి రాజు, ఉపాధ్యక్షుడిగా బండారు. నరేశ్, ప్రధాన కార్యదర్శిగా గొర్లి స్వామినాయుడు ఎన్నికయ్యారు. బుధవారం మండల పార్టీ అధ్యక్షుడు వియ్యపు చిన్న సమక్షంలో గ్రామ పార్టీ నాయకులు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జి. కనకారావు పాల్గొన్నరు.
KDP: DCCB ఛైర్మన్‌గా సూర్యనారాయణ రెడ్డి ఎన్నికైన సందర్భంగా ప్రభుత్వ విప్ ఆదినారాయణ రెడ్డి, టీడీపీ ఇంఛార్జ్ భూపేశ్ రెడ్డిని ఆయన జమ్మలమడుగులో మర్యాదపూర్వకంగా కలిశారు. బాబాయి, అబ్బాయిలకు బొకేలు అందజేసి, ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు.
NDL: కోయిలకుంట్ల మండలం రేవనూరు గ్రామ సమీపంలో ఉన్న కుందూ నదిలో గొర్రెల కాపరి జయవర్ధన్ అనే యువకుడు గురువారం మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు జయవర్ధన్ అనే యువకుడు గొర్రెలు కాయడానికి వెళ్ళాడు. కుందూ నది దాటే క్రమంలో నదిలో పడి మృత్యువాత పడ్డాడు. రేవనూరు పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి, కేసు నమోదు చేసుకున్నారు.
VSP: హనుమంతవాక జంక్షన్‌లో లారీ కారుని ఢీ కొంది. ఈ ప్రమాదంలో కారు వెనుక భాగమంతా నుజ్జునుజ్జయింది. డైరీ ఫాం నుంచి వెంకోజిపాలెం వెళ్లే రహదారి మార్గం మధ్యలో ఈ ప్రమాదం జరిగింది. ఉదయం ట్రాఫిక్ తక్కువ ఉండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగలేదు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ నియంత్రణ చేశారు. లారీ అతివేగమే ప్రమాదానికి కారణమని వాహనదారులు తెలిపారు.
KRNL: జిల్లాలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 3 నుంచి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకిగాను మే 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు గిరిజన సంక్షేమ సాధికారిత అధికారిణి తులసీదేవి బుధవారం తెలిపారు. ఆలూరు, కర్నూలు, తుగ్గలిలో ఖాళీగా ఉన్న సీట్లకు అర్హులైనవారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. లాటరీ పద్ధతిలో ఎంపిక ఉంటుందన్నారు.
VZM: టీడీపీ విజయనగరం జిల్లా అధ్యక్షులు కిమిడి నాగార్జున DCCB ఛైర్మన్ పదవి కేటాయించిన అనంతరం బుధవారం తొలిసారిగా ఆయన నివాసం చీపురుపల్లి వచ్చిన సందర్భంగా TDP నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తనకు పదవిని కేటాయించినందుకు సీఎంకు, లోకేశ్‌కి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతం చేయడానికి, రైతులకు సేవ చేయడానికి పని చేస్తానని తెలియజేశారు.
PPM: సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపడుతున్నట్లు పార్వతీపురం మున్సిపల్ కమీషనర్ సీ.హెచ్.వేంకటేశ్వర రావు తెలిపారు. ఈ మేరకు బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. పట్టణ పరిధిలోని వీధి దీపాలపై ఫిర్యాదు అందిన తక్షణం మరమతులు నిర్వహించి దీపాలు వెలిగేటట్లుగా చేయడం జరుగుతుందన్నారు. డ్రైనేజీలు, సీసీ రోడ్లు నిర్మాణంపై ఫిర్యాదుల మేరకు చేపడతామని చెప్పారు.
SKLM: సింహాచలంలో జరిగిన ఘటన బాధాకరమైన విషయమని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఇటువంటి ఘటన ఎన్నడూ జరగలేదని వివరించారు. ఈ ఘటనలో గాయపడిన బాధితులు త్వరగా కోలుకోవాలని ఆయన కోరారు. మృతి చెందిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన స్పష్టం చేశారు.
ప్రకాశం: బాల్యవివాహాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని వెలిగండ్ల మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని గంధం కృపవరం అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని స్థానిక మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో అంగన్వాడీ కార్యకర్తలకు ఐటిసి బంగారు బాల్యం, కిషోర్ వికాసం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె కరపత్రాలను ఆవిష్కరించారు.
VZM: చీపురుపల్లి ఎమ్మెల్యే మరియు మాజీ మంత్రి కిమిడి కళావెంకటరావు కంటికి ఇటీవల శస్త్ర చికిత్స జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన బుధవారం రాజాంలోని కళా వెంకటరావు నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పరామర్శించిన వారిలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శ అల్లాడ భాస్కరరావు ఉన్నారు.
BPT: ఇంకొల్లు మండలం పాత మద్రాసు రోడ్డు కొనికి వెళ్లే మార్గంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని బుధవారం స్థానికులు గుర్తించారు. చెట్ల మధ్య మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు ఎవరు?, ఎందుకు చనిపోయాడు?, హత్య, ఆత్మ హత్య అన్న విషయాలు తెలియాల్సి ఉందని ఇంకొల్లు ఎస్సై సురేష్ పేర్కొన్నారు.
NLR: కోవూరు (మం) పోతిరెడ్డిపాలెం వద్ద జరిగిన కారు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడంపై మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైవేపై అదుపు తప్పిన కారు ఓ ఇంట్లోకి దూసుకెళ్లగా, ఇంట్లోని వ్యక్తితోపాటు, ఐదుగురు విద్యార్థులు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన బాధాకరమని, గాయాలతో బయటపడ్డ వ్యక్తి త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు.
NTR: గంపలగూడెం మండలానికి చెందిన టీడీపీ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి ఐలూరి భార్గవరెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. బుధవారం తిరువూరు నియోజకవర్గ ఇంఛార్జ్ నల్లగట్ల స్వామిదాసు సమక్షంలో జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కొండ ఉపేందర్ రెడ్డి, ఆడెపు ఉదయ వెంకట సాయి తదితరులు వైసీపీలోకి చేరారు.
BPT: తన మీద టిడిపి అవిశ్వాస తీర్మానం పెట్టిన నేపథ్యంలో వైసీపీకి చెందిన చీరాల మున్సిపల్ ఛైర్మన్ శ్రీనివాసరావు బుధవారం అధికార పార్టీలో చేరిపోయారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య సమక్షంలో ఆయన టీడీపీ కండువా కప్పుకున్నారు. శ్రీనివాసరావును వాళ్ళు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.