NTR: భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి అమిత్ షా తన మంత్రి పదవికి రాజీనామా చేసి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ తిరువూరులోని బోసుబొమ్మ సెంటర్లో సోమవారం సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్, నాగేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు.
కృష్ణా: ఉమ్మడి జిల్లా రాజకీయ ముఖచిత్రాన్ని 2024 ఎన్నికలు మార్చేశాయి. 2019 ఎన్నికల్లో మొత్తం 16 నియోజకవర్గాల్లో 14 వైసీపీ, TDP 2 సీట్లలో గెలిచింది. ఈసారి 16 నియోజకవర్గాల్లోనూ కూటమి అభ్యర్థులు విజయ దుందుభి మోగించారు. 2 ఎంపీ సీట్లతో పాటు 13 స్థానాల్లో TDP, ఒకటి జనసేన, 2 స్థానాల్లో బీజేపీ నెగ్గాయి. మంత్రులుగా కొల్లు రవీంద్ర, పార్థసారథి కొనసాగుతున్నారు.
NDL: నంద్యాల పద్మావతి నగర్ ఇండోర్ స్టేడియంలో తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలను నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్కెఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి, డిఎం గౌస్, కామిని బాలకృష్ణ హాజరయ్యారు. తులసి రెడ్డి మాట్లాడుతూ.. క్రీడల వల్ల శరీరం దృఢత్వం పెరుగుతుందన్నారు. అప్పుడే మానసిక ధైర్యం ఆత్మస్థైర్యం అలవరుతుందన్నారు.
GNTR: పార్లమెంట్ సాక్షిగా బీఆర్ అంబేద్కర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా వెనక్కి తీసుకోవాలని దళిత ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రత్తిపాడు మండలంలోని బస్టాండ్ వద్ద సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. బీఆర్ అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. వెంటనే అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
కడప: సూపర్ సిక్స్ పథకాలను రాష్ట్ర ప్రజలకు చెప్పిన ప్రకారం అందజేస్తామని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి అన్నారు. ప్రొద్దుటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ విద్యుత్ ఛార్జీలను బూచిగా చూపించి ప్రజల్లో అపోహలు సృష్టిస్తుందన్నారు. ప్రజలను ఒప్పించిన తర్వాతే విద్యుత్ ఛార్జీల పెంపు అంశాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని పేర్కొన్నారు.
E.G: పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సోమవారం రాజోలు సెంటర్లో నిరసనలు చేశారు. రాజ్యాంగాన్ని కాపాడుకుందాం లౌకికవాదం వర్ధిల్లాలి అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. సీపీఐ నాయకులు దేవరాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. అమిత్‌షాను మంత్రిపదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
W.G: నిడదవోలు పట్టణంలో రోజురోజుకు కుక్కల సమస్య పెరగడంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీధి కుక్కలు మోటర్ సైకిల్ వెనకాల వెంబడిస్తుండటంతో పలువురు గాయపడుతున్నారు. కుక్కల నివారణకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఇటీవల జరిగిన కౌన్సిల్ సమావేశంలో కుక్కల నివారణకు ఇంజక్షన్లు కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించినట్లు తెలిపారు.
VZM: జనవరి 3 నుండి 8 వరకూ ఢిల్లీలో జరగనున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ కబడ్డీ పోటీలకు గుణుపూరు పేట వ్యాయామ ఉపాధ్యాయుడు సారిపల్లి గౌరీశంకర్ ఎంపికైనట్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన ఇటీవల విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి ఎంపికల్లో పాల్గొని మంచి ప్రతిభ కనబరచి జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే జట్టుకు ఎంపికయ్యారు.
బాపట్ల: ప్రజల సమస్యలు త్వరగా పరిష్కరించే విధంగా అధికారులకు కృషి చేయాలని కలెక్టర్ వెంకట్ మురళి సూచించారు. జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ప్రజల నుంచి వచ్చే అర్జీలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
KRNL: మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి 2025 జనవరి ఒకటో తేదీన మధ్యాహ్నం బేతంచెర్లకు వస్తాడని ఎంపీపీ బుగ్గన నాగభూషణ్ రెడ్డి, నగర పంచాయతీ ఛైర్మన్ చలం రెడ్డి సోమవారం తెలిపారు. మాజీ మంత్రికి నూతన సంవత్సర శుభాకాంక్షలు నిలపడానికి వచ్చే మండల ప్రజలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు గమనించగలరని తెలిపారు.
అన్నమయ్య: లక్కిరెడ్డిపల్లె మండలం ఈడిగపల్లి గ్రామానికి చెందిన అభినయ్ చింతమాని నేషనల్ ఫీల్డ్ ఇండోర్ ఆర్చరీ ఛాంపియన్ షిప్ 2024 – 25లో ప్రతిభ చూపాడు. డిసెంబర్ 26 – 29 లక్నోలో జరిగిన ఈ పోటీల్లో అండర్ -14 కేటగిరీలో స్వర్ణ పతకం, అండర్ -19 కేటగిరీలో రజత పతకాన్ని గెలుచుకున్నాడు. కడపలోని ఓ స్కూల్లో 7వ తరగతి చదువుతున్న అభినయ్ విజయంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు.
కడప: కొండాపురం మండలం వెంకటాపురంలో సోమవారం రెవెన్యూ సదస్సు కార్యక్రమాన్ని తహశీల్దార్ గురప్ప నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్నదాతలు తమ భూముల సమస్యలు ఉంటే తెలియపరచాలని, 45 రోజులలో పరిష్కారం చూపుతామన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, తెలుగు రైతు అధికార ప్రతినిధి వెంకటేశ్వర నాయుడు, రైతులు పాల్గొన్నారు.
VSP: నర్సీపట్నం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలో సోమవారం మెప్మా అర్బన్ మార్కెట్ ఏర్పాటు చేశారు. డ్వాక్రా మహిళలు తమ ఉత్పత్తులను ఈ మార్కెట్ ద్వారా అమ్మకాలు కొనసాగించారు. ఈ సందర్భంగా క్లస్టర్ ఆఫీసర్ రమ మాట్లాడుతూ.. డ్వాక్రా సభ్యుల అభివృద్ధికి మెప్మా కృషి చేస్తుందన్నారు. రుణాలు ఇప్పించడం దగ్గర నుంచి డ్వాక్రా మహిళల చేత వ్యాపారాలు పెట్టిస్తున్నామన్నారు.
KRNL: కర్నూలులో జరిగిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సమావేశంలో నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఒక డాక్టర్‌గా అందరికీ సహాయంగా ఉంటానని తెలిపారు. మీ సమస్యలను తన వద్దకు తీసుకురావచ్చని సూచించారు. వాటిని నేషనల్ హెల్త్ కమిటీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా డాక్టర్లు పాల్గొన్నారు.
బాపట్ల: మండల కేంద్రమైన కర్లపాలెం రెవెన్యూ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో 23శాఖల అధికారులు పాల్గొనాల్సి ఉండగా 7 శాఖల అధికారులు మాత్రమే ఉదయం 11 గంటలలోపు హాజరు అయ్యారు. ఈ సందర్భంగా వారు ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, ఆయా సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.