• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

న్యాయవాదులకు పోలీసుల నుండి రక్షణ కల్పించాలి

SKLM: అనంతపురంలో మూడు రోజుల క్రితం ఒక కేసు విషయంలో సీనియర్ న్యాయవాది బివి శేషాద్రిని పోలీసులు భయభ్రాంతులకు గురి చేయడంతో మృతిచెందిన సంఘటన జరిగింది. ఈ మేరకు ఆమదాలవలస జూనియర్ సివిల్ కోర్టు ఆవరణలో సోమవారం బార్ అసోసియేషన్ అధ్యక్షురాలు కణితి విజయలక్ష్మి ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులను బహిష్కరించారు. న్యాయవాదులకు పోలీసుల నుండి రక్షణ కల్పించాలని అన్నారు.

December 30, 2024 / 02:53 PM IST

సచివాలయం నోటీసు బోర్డులో ఎస్సీ జాబితా

ప్రకాశం: సంతమాగులూరు మండలంలోని ఏల్చూరు గ్రామంలో ఉన్నటువంటి సచివాలయం త్రీలో ఎస్సీ కులానికి సంబంధించిన జనాభా జాబితాను సచివాలయ సిబ్బంది సోమవారం నోటీస్ బోర్డులో ప్రదర్శించారు. ఇందులో సంబంధిత సామాజిక వర్గం వాళ్ళు లిస్టును పరిశీలించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ వెంకటేశ్వర్ నాయక్, వీఆర్వో బ్రహ్మం పాల్గొన్నారు.

December 30, 2024 / 02:52 PM IST

నలుగురు హెడ్ వార్డర్లు బదిలీ

KRNL: జిల్లాలోని నలుగురు హెడ్ వార్డర్లు, ఓ వార్డర్ బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు. కర్నూలు జిల్లా కారాగారంలో విధులు నిర్వర్తిస్తున్న హెడ్ వార్డర్లు ఎం.ప్రసాద్, పీ.శ్రీనివాస రావు, ఎం.రాము నాయుడు, నంద్యాల స్పెషల్ సబ్ జైలు హెడ్ వార్డర్ ఎస్.కామేశ్వర రావు, వార్డర్ వీ.శ్రీను బదిలీ అయిన వారిలో ఉన్నారు.

December 30, 2024 / 02:50 PM IST

కంచికచర్లలో వీధి కుక్కల స్వైర విహారం

కృష్ణా: కంచికచర్ల పట్టణంలో వీధి కుక్కల బెడద అధికంగా ఉందని స్థానిక ప్రజలు వాపోయారు. కుక్కలు గుంపులుగా స్వైర విహారం చేస్తున్నాయని, చిన్నారులను బయటకు పంపించాలంటే భయపడాల్సి వస్తుందని ఆవేదన చెందారు. రాత్రి సమయాల్లో రహదారిపైకి వస్తే వెంటపడుతున్నాయని ప్రజలు ఆరోపించారు. సంబంధిత అధికారులు స్పందించి వీధి కుక్కల బెడద నుంచి రక్షించాలని ప్రజలు కోరుతున్నారు.

December 30, 2024 / 02:50 PM IST

కడప జిల్లాలో తగ్గిన నేరాలు: ఎస్పీ

KDP: గతేడాదితో పోల్చుకుంటే ఈసారి కడప జిల్లాలో క్రైమ్ రేట్ బాగా తగ్గిందని జిల్లా ఇంఛార్జ్ ఎస్పీ విద్యాసాగర్ నాయుడు స్పష్టం చేశారు. కడపలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో పోలీస్ అధికారులు, సిబ్బంది సమర్థవంతంగా విధులు నిర్వహించారని అభినందించారు. నేరాల తగ్గుదలకు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై గట్టి నిఘా ఉంచామన్నారు.

December 30, 2024 / 02:47 PM IST

గృహ నిర్బంధంలో సీపీఎం నేత

AKP: ఎస్ రాయవరం మండలం ధర్మవరం గ్రామంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం.అప్పలరాజును పోలీసులు సోమవారం ఉదయం నుంచి గృహ నిర్బంధంలో ఉంచారు. నక్కపల్లి మండలంలో బల్క్ డ్రగ్ పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి పనులు జరుగుతున్న నేపథ్యంలో వాటిని అడ్డుకుంటారని భావించి పోలీసులు ఈ చర్యలకు దిగినట్లు అప్పలరాజు ఆరోపించారు.

December 30, 2024 / 02:43 PM IST

రాయల్టీ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్

NDL: బేతంచెర్ల పట్టణంలో రాయల్టీ ధరలను ప్రభుత్వం వెంటనే తగ్గించాలని కోరుతూ గని కార్మికులు సోమవారం నాడు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. రిలే నిరాహార దీక్షలకు సీపఐ పార్టీ నాయకులు భార్గవ్, దస్తగిరి, తిరుమలేష్ కలిసి వారికి సంఘీభావంగా మద్దతు తెలిపారు. పెంచిన రాయల్టీ ధరలను వెంటనే తగ్గించాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని సీపీఐ నాయకులు అన్నారు.

December 30, 2024 / 02:41 PM IST

అమిత్ షా వ్యాఖ్యలకు నిరసన కార్యక్రమం

ప్రకాశం: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర అమిత్ షాను తక్షణమే కేంద్ర మంత్రివర్గం నుండి బర్త్‌రఫ్ చేయాలని సీపీఎం ముండ్లమూరు కార్యదర్శి ఆంజనేయులు అన్నారు. సోమవారం మారెళ్ళ గ్రామంలో అనుచిత వ్యాఖ్యలకు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మాట్లాడడం బాధాకరమన్నారు.

December 30, 2024 / 02:40 PM IST

1న మాజీ మంత్రి బుగ్గన డోనుకు రాక

NDL: మాజీ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి నియోజకవర్గం కేంద్రమైన డోన్ పట్టణంలో నూతన సంవత్సర సందర్భంగా ఒకటవ తేదీన అందుబాటులో ఉంటారని మీట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ శ్రీరాములు, ఎంపీపీ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అందుబాటులో ఉంటారన్నారు. ప్రజలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు గమనించగలరని తెలిపారు.

December 30, 2024 / 02:40 PM IST

అర్జీలపై దృష్టి సారించాలి: కలెక్టర్‌

TPT: జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక(PGRS) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్జీదారుల నుండి కలెక్టర్ వెంకటేశ్వర్ ఫిర్యాదులను స్వీకరించారు. అర్జీలకు వీలైంనంత త్వరగా పరిష్కారం చూపాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

December 30, 2024 / 02:39 PM IST

వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

ELR: స్ఫూర్తి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గత 15 సం.లుగా చేసిన వివిధ సామాజిక సేవా కార్యక్రమాల వివరాలతో రూపొందించిన వెబ్‌సైట్‌ను సోమవారం ఎమ్మెల్యే రోషన్ కుమార్ చేతులమీదుగా ప్రారంభించారు. అనంత ఎమ్మెల్యే మాట్లాడారు. సంస్థ సేవా కార్యక్రమాలను అభినందించారు. ఈ కార్యక్రమంలో స్ఫూర్తి ఫౌండేషన్ కార్యదర్శి మొహిద్దిన్ భాష తదితరులు పాల్గొన్నారు.

December 30, 2024 / 02:38 PM IST

ఈవీఎం గిడ్డంగిని పరిశీలించిన కలెక్టర్

AKP: ఎస్పీ కార్యాలయం ప్రాంగణంలో గల ఈవీఎం గిడ్డంగిని అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్ రాజకీయ ప్రతినిధుల సమక్షంలో సోమవారం తనిఖీ చేశారు. గిడ్డంగి సీళ్లను పరిశీలించారు. సీసీ కెమెరాలు అగ్నిమాపక పరికరాలు భద్రత ఏర్పాట్లను తనిఖీ చేశారు. కలెక్టర్ వెంట జిల్లా రెవిన్యూ డివిజనల్ అధికారి సత్యనారాయణరావు, ఆర్డీవో షేక్ ఆయిషా ఉన్నారు.

December 30, 2024 / 02:33 PM IST

మహాసభలో 35 తీర్మానాలకు ఆమోదం

VSP: పెందుర్తిలో నిర్వహించిన సీపీఎం 24వ మహాసభలో 35 తీర్మానాలను ఆమోదించినట్లు పార్టీ విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గు నాయుడు తెలిపారు. సోమవారం జగదాంబ సెంటర్ వద్ద గల పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. విశాఖ నగరంలో ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు, రిజిస్ట్రేషన్ తదితర సమస్యలపై ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి పోరాటాలు చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.

December 30, 2024 / 02:27 PM IST

ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్య

ATP: గుత్తి మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని శ్రీపురం గ్రామంలో రాజేష్ అనే యువకుడు సోమవారం ఉరి చేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

December 30, 2024 / 02:26 PM IST

‘యువతను సన్మార్గంలో నడిపించేందుకు కృషి చేయాలి’

KDP: యువతను సన్మార్గంలో నడిపించేందుకు డీవైఎఫ్ఎ నాయకులు కృషి చేయాలని అర్బన్ సీఐ ఎం.రాజగోపాల్ తెలిపారు. డీవైఎఫ్ఎ ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్లను స్థానిక అర్బన్ స్టేషన్ ఆవరణలో ఆయన విడుదల చేసి మాట్లాడారు. నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి, వివిధ అంశాలలో వారిలో చైతన్యం నింపేందుకు డీవైఎఫ్ఎ చేస్తున్న కృషి గొప్పదన్నారు.

December 30, 2024 / 02:23 PM IST