E.G: ఆలమూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని DSP సుంకర మురళీమోహన్ రావు, రహదారుల ప్రాజెక్టు డైరెక్టర్ బి కృష్ణమూర్తి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం రహదారిపై ఎక్కువ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను వారు క్షేత్రస్థాయిలో CI సిహెచ్ విద్యాసాగర్, ఆలమూరు ఎస్ఐ జీ నరేష్‌తో కలిసి పరిశీలించారు.
కోనసీమ: ఆలమూరు మండలం పరిధిలోని జొన్నాడ నుంచి పొట్టిలంక వరకు ఉన్న రహదారిపై తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక బృందం విస్తృతంగా పర్యవేక్షణ నిర్వహించింది. డీఎస్పీ సుంకర మురళి, సీఐ విద్యాసాగర్, ఆలమూరు ఎస్‌ఐ జి నరేష్‌లు ఉన్నారు. తరచుగా జరిగే ప్రాంతాలను గుర్తించి, అక్కడ శాశ్వత నివారణ చర్యలు చేపట్టనున్నారు
PLD: చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలు ఎప్పుడూ తాగునీటి సమస్యను ఎదుర్కోలేదని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రజలకు సురక్షిత తాగునీరు అందించడంలో ఎటువంటి రాజీ పడలేదని పేర్కొన్నారు. పట్టణ శివారులోని సమ్మర్ స్టోరేజ్ వాటర్ ట్యాంకుల్లో నీటిని నింపే పనులను శుక్రవారం కూటమి నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు.
CTR: పుంగనూరు తాలూకా AP-JAC నూతన కార్యవర్గ సమావేశం శుక్రవారం విశ్రాంత ఉద్యోగుల భవనంలో జరిగింది. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. పుంగనూరు తాలూకా ఛైర్మన్‌గా డాక్టర్ రహమత్ అలీ ఖాన్, సెక్రటరీగా బుడ్డన్న యాదవ్, ట్రెజరర్‌గా శ్రీనివాసులు, వైస్ ఛైర్మన్లుగా అయూబ్ ఖాన్,జగన్నాథ్ రాజు ఎన్నికైనట్లు చిత్తూరు జిల్లా ఛైర్మన్ రాఘవులు తెలిపారు.
ATP: ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని, ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యంతో స్వయం సమృద్ధి సాధించాలని కేవీఐసి ఛైర్మన్ మనోజ్ కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం అనంతపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న 430 మంది చేతివృత్తి కళాకారులకు పనిముట్లు, పరికరాలను పంపిణీ చేశారు.
NLR: మార్కాపురం సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో గాయపడి ఒంగోలు రిమ్స్ చికిత్స పొందుతున్న బాధితులను మంత్రులు డోలా బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యేలు ఇంటూరి నాగేశ్వరరావు, దామచర్ల జనార్ధన్, బి.ఎన్ విజయ్ కుమార్ తదితరులు శుక్రవారం పరామర్శించారు. బాధితులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.
ELR: ఈనెల 29న టీడీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని ఏపీ ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు పిలుపునిచ్చారు. నిడమర్రులో సభాస్థలిలో ఏర్పాట్లను పరిశీలించిన ఆయన, శుక్రవారం మీడియాతో మాట్లాడారు. వేడుకల నిర్వహణకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ.. ఆదివారం సాయంత్రం 4గంటలకు నిర్వహించనున్న సభకు టీడీపీ కుటుంబ సభ్యులంతా హాజరవ్వాలని కోరారు.
విశాఖపట్నం అల్లిపురం 33వ వార్డులో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో వైసీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారి పల్లకి ఊరేగింపు నిర్వహించారు. రాష్ట్రంలో మళ్లీ రామరాజ్యం రావాలని ఆకాంక్షించారు. అలాగే, శ్రీరాముడి పాలనలో ప్రజలు సుఖశాంతులతో జీవించారని పేర్కొన్నారు.
శ్రీకాకుళం నగరం రామలక్ష్మణ కూడలి వద్ద శ్రీ సత్యసాయి సేవా సమితి బ్యాంకర్స్ కాలనీ వారి సౌజన్యంతో నూతన చలివేంద్రం శుక్రవారం ప్రారంభించారు. మున్సిపల్ కమిషనర్ హనుమంతు కూర్మారావు, శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షులు సూర రామచంద్రరావు పాల్గొన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి సేవా స్ఫూర్తితో జిల్లాలో 100 చలివేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు.
అన్నమయ్య: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఈ విషయం తెలిసి జరుగుతుందో లేదో తెలియదని, కానీ త్రిసభ్య కమిటీ నివేదిక రాకముందే ఎమ్మెల్యే శ్రీధర్‌ను పార్టీ కార్యక్రమాల్లో అనుమతిస్తున్నారని బాధితురాలు హర్షవీణ ఆరోపించారు. ఇది పవన్ కళ్యాణ్‌కు తెలియకుండా జరుగుతుందా అనే సందేహాన్ని కూడా ఆమె వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై స్పష్టత ఇవ్వాలని, తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
విజయనగరం స్థానిక గూడ్స్ షెడ్ వద్ద ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యస్వామి దేవస్థానంలో శ్రీ సీతారామ కల్యాణం అంగరంగ వైభవంగా జరిపారు. ఈ సందర్భంగా ఈవో వెంకటరమణ. ఛైర్మన్ రెయ్యి శంకర్ రెడ్డి స్వామి వారికి దేవస్థానం తరుఫున పట్టువస్త్రాలు సమర్పించి కల్యాణ మహోత్సవం జరిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కళ్యాణాన్ని తిలకించారు.
PLD: చిలకలూరిపేట మండలం కావూరు వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. నరసరావుపేట వైపు వెళుతున్న ఆటోను వెనుక నుంచి వేగంగా వచ్చిన ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ చోదకుడు ఢీకొట్టిన వేగానికి గాల్లోకి ఎగిరి అదే ఆటోలో పడినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన అతడిని 108 అంబులెన్స్ సిబ్బంది వెంటనే చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
W.G: భీమవరం జువ్వలపాలెం రోడ్డులోని శ్రీ పద్మావతీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో అపురూప దృశ్యం అవిష్కృతమైంది. ఉత్తరాయణ పుణ్యకాలం, మీన సంక్రమణం వేళ శుక్రవారం ఉదయం సూర్యకిరణాలు స్వామివారి పాదాలను తాకాయి. శ్రీరామననమి పర్వదినం నాడే ఈ విశేషం జరగడంతో భక్తులు పులకించిపోయారు. ఆలయ అర్చకులు స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
CTR: జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్‌ను జనసైనికులు కలసి ఘనంగా సత్కరించారు. పార్టీకి విశేష సేవలందించిన ఆయనకు గజమాలతో సన్మానం చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తూ, ప్రజలకు మేలు చేసే దిశగా కృషి చేయాలని హరిప్రసాద్ పిలుపునిచ్చారు.
ప్రకాశం: కనిగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో జననీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్‌ను ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి బంధువులకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు.