కోనసీమ: జిల్లా వ్యాప్తంగా 33 కేంద్రాల్లో శుక్రవారం ఇంటర్ ప్రథమ సంవత్సర బోటనీ, హిస్టరీ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జనరల్, ఒకేషనల్ విభాగాల్లో మొత్తం 2,487 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. 401 మంది గైర్హాజరు కావడంతో 86.11 శాతం హాజరు నమోదైందని అధికారులు వెల్లడించారు. ఈ పరీక్షల్లో ఎక్కడా ఎటువంటి మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదన్నారు.
బాపట్ల: ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాల ఎన్సీసీ క్యాడెట్ యు. ఉమా మనాలి అడ్వెంచర్ క్యాంప్‌కు ఎంపికయ్యారు. గుంటూరులో జరిగిన ఎంపికల్లో సుమారు 40 మంది క్యాడెట్లు పోటీ పడ్డారు. శారీరక దృఢత్వం, నాయకత్వ లక్షణాల ఆధారంగా సీఎస్ఈ 3వ సంవత్సరం చదువుతున్న ఉమాను అధికారులు ఎంపిక చేశారు. ఏప్రిల్ 17 నుంచి 26 వరకు మనాలిలో ఈ క్యాంప్ జరగనుంది.
KRNL: పశ్చిమ ప్రాంత అభివృద్ధి కోసం ఆదోని జిల్లా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ.. ఆదోని జిల్లా సాధన జేఏసీ ఆధ్వర్యంలో 104వ రోజు రిలే నిరాహార దీక్ష కొనసాగింది. ప్రభుత్వం వెంటనే స్పందించాలని JAC నాయకులు డిమాండ్ చేశారు. ఈ దీక్షలో శుక్రవారం ఎమ్మార్పీఎస్ నాయకులు జగన్ మాదిగ, కిరణ్ మాదిగ, భూదెబ్బ మాదిగ తదితరులు పాల్గొన్నారు. పలువురు నాయకులు సంఘీభావం తెలిపారు.
E.G: మార్చి నెల ఎన్టీఆర్ సామాజిక భరోసా పెన్షన్లను లబ్ధిదారులకు ఒకరోజు ముందుగానే అందజేయనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. సాధారణంగా ప్రతి నెలా ఒకటో తేదీన పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. అయితే, ఈసారి మార్చి 1వ తేదీ ఆదివారం కావడంతో, లబ్ధిదారుల సౌకర్యార్థం శనివారం నాడే పెన్షన్లు పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు కలెక్టర్ శుక్రవారం వెల్లడించారు.
ప్రకాశం: దర్శి పట్టణంలో మార్చి 1వ తేదీ ఆదివారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉదయం 9 గంటల నుంచి మ.3 గంటల వరకు ఉచిత మెగా మెడికల్ క్యాంపును ఏర్పాటు చేస్తున్నట్లు దర్శి ఇంఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ తెలిపారు. దర్శి ప్రజల ఆరోగ్యం బాధ్యత తాను తీసుకున్నానన్నారు. ఏడాది కిందట మెగా మెడికల్ క్యాంపును ఏర్పాటు చేస్తే దాదాపు 5,000 మంది ఉపయోగించుకున్నారన్నారు.
WG: మార్చి 14న తణుకులో నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలని తణుకు నాలుగో అదనపు జిల్లా జడ్జి డి.సత్యవతి కోరారు. రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, మోటారు వాహనాల ప్రమాదాలు కేసులు, కుటుంబ తగాదాల కేసులు రాజీ చేసుకోవచ్చని చెప్పారు. లోక్ అదాలతో ద్వారా విలువైన సమయం, డబ్బులు ఆదా చేసుకోవచ్చని ఆమె వివరించారు.
ప్రకాశం: తర్లుపాడు మండలం తుమ్మలచెరువులో కాంగ్రెస్ మైనార్టీ ఛైర్మన్ డా. షేక్ మహబూబ్ వలి ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత వైద్య శిబిరాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా డెంటల్, గైనకాలజీ, జనరల్ డాక్టర్లు 242 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు అందజేశారు. ఈ ప్రాంతంలో వైద్య సేవలు అందుబాటు లేక ప్రజల అవస్థలు పడుతున్నారని మహబూబ్ వలి తెలిపారు.
BPT: రేపల్లె పట్టణ ఆదర్శ వేదిక ఆధ్వర్యంలో ఆంధ్ర రత్న మున్సిపల్ హైస్కూల్‌లో శుక్రవారం 35 మంది పదో తరగతి విద్యార్థులకు పరీక్షా సామగ్రిని పంపిణీ చేశారు. మున్సిపల్ కమిషనర్ కె. సాంబశివరావు చేతుల మీదుగా ఈ సామగ్రిని అందజేశారు. విద్యార్థులు పబ్లిక్ పరీక్షల్లో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలని ఈ సందర్భంగా కమిషనర్ ఆకాంక్షించారు.
CTR: కార్వేటినగరం(M) దిగువఎరమరాజు పల్లి గ్రామానికి చెందిన కొందరు నాయకులు తమపై దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ రైతు వెంకటాద్రి రెడ్డి ఆత్మహత్యాయత్యానికి పాల్పడ్డాడు. రైతు పొలం వద్ద సమస్య పరిష్కరించేందుకు రెవెన్యూ అధికారులు వచ్చారు. ఈ సమయంలో స్థానిక నాయకులు తమపై దౌర్జన్యం చేశారంటూ రైతు ఆవేదన వ్యక్తం చేశారు.
ELR: పిల్లల ప్రవర్తనను నిరంతరం తల్లిదండ్రులు గమనిస్తూ సరైన మార్గ నిర్దేశం చేయాలని ఉంగుటూరు MEO-1రవీంద్ర భారతి అన్నారు. శుక్రవారం స్థానిక ఎంఈఓ కార్యాలయంలో జరిగిన ఆడపిల్లలపై లైంగిక దాడుల నివారణ పై మండల స్థాయి అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… బాలల హక్కులు పోక్స్ చట్టంపై అవగాహన కల్పించారు. ఎంఈఓ 2 సాయిబాబు, తదితరులు పాల్గొన్నారు.
KDP: VN పల్లెలో ఏర్పాటు చేసిన బుడ్డ శనగ కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం కమలాపురం వ్యవసాయ శాఖ ఏడీఏ నరసింహారెడ్డి, ఏవో శ్యాంబాబుతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా DCMS ఇన్ఛార్జ్ నాగిరెడ్డిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులు ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలను పాటించి సొంత ఖర్చుతో విత్తన కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలన్నారు.
CTR: పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కాసేపట్లో చిత్తూరుకు రానున్నట్లు జనసేన వర్గాలు తెలిపాయి. సాయంత్రం నాలుగు గంటలకు చిత్తూరులో పార్లమెంటరీ పరిధిలోని ముఖ్య నాయకులతో నిర్వహించే సమావేశంలో ఆయన పాల్గొంటారని వెల్లడించారు. ఆయనతోపాటు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, హరిప్రసాద్ హాజరవుతారని పేర్కొన్నారు.
KRNL: అయేషా మీరా హత్య కేసులో సుప్రీంకోర్టు తీర్పును పునరాలోచించాలని సమతా సైనిక్ దళ్ రాష్ట్ర ప్రతినిధి రంగయ్య శుక్రవారం డిమాండ్ చేశారు. 19 ఏళ్లుగా న్యాయం జరగకపోవడం బాధాకరమన్నారు. అసలు నిందితులను పట్టుకోలేకపోవడం వల్ల న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం కోల్పోతున్నదని అన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని రంగయ్య కోరారు.
PPM: కురుపాం గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థినులు అస్వస్థతకు గురైనఘటనపై ఎంపీడీవో కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. మాదలింగి పీహెచ్‌సీ వైద్యాధికారిణి డా.తనూజా మాట్లాడుతూ.. డయేరియా లక్షణాలు లేవని, నిల్వ పచ్చళ్లు తినడం వల్ల విరేచనాలు వచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం విద్యార్థినుల ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు. ఈ సమావేశంలో డాక్టర్ సందీప్ ఉన్నారు.
TPT: ముగ్గురు SV శిల్పకళాశాల విద్యార్థులు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన కలంకారి వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు. ఫిబ్రవరి 16 నుంచి 26 వరకు జరిగిన ఉత్సవంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 21 మంది ప్రముఖ కళాకారులు పాల్గొనగా.. అందులో SV శిల్పకళాశాల పూర్వ విద్యార్థులు ఏ.ధనుంజయ్, పి.భాను ప్రకాష్, సి.మధు పాల్గొని ప్రతిభ చాటారు. రాష్ట్రపతి వారిని మెమెంటోతో సత్కరించారు.