SS: పుట్టపర్తిలో రెవెన్యూ, పోలీస్ జట్ల మధ్య ఆదివారం 20 ఓవర్ల స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్ ఉత్సాహంగా జరిగింది. మొదట పోలీస్ జట్టు 120 పరుగులు చేయగా, ఎస్పీ సతీష్ కుమార్ 40 పరుగులతో రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనలో రెవెన్యూ జట్టు 18.1 ఓవర్లలోనే విజయం సాధించింది. కలెక్టర్ శ్యాం ప్రసాద్, అశోక్, ఇమ్రాన్ కీలక పరుగులు చేసి జట్టును గెలిపించారు.
ELR: ప్రభుత్వ ఆదేశాల మేరకు దేవాలయాలు, ఇతర కార్యక్రమాల్లో బాణాసంచా కాల్చడంపై నిషేధం ఉందని నిడమర్రు ఎస్సై రమేశ్ స్పష్టం చేశారు. పెద నిండ్రకొలనులో జరిగే శ్రీ భీమేశ్వరస్వామి కల్యాణోత్సవాల్లో, ముఖ్యంగా భీమగుండం చెరువు వద్ద నిర్వహించే తెప్పోత్సవంలో ఎలాంటి టపాసులు పేల్చరాదని హెచ్చరించారు. నిబంధనలను ఉల్లంఘించరాదని, ఈ విషయంలో ఉత్సవ కమిటీ సభ్యులు సహకరించాలన్నారు.
PLD: మాచర్ల పురపాలక సంఘ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి సోమవారం పరిశీలించనున్నట్లు కమిషనర్ వేణుబాబు ఆదివారం తెలిపారు. 8, 9, 10, 11 వార్డులలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ ఛైర్మన్ షేక్ మదార్ సాహెబ్ పాల్గొనే ఈ పర్యటనలో అధికారులు హాజరు కావాలని సూచించారు.
GNTR: సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా మార్చి 3న కాకుమాను మండలం కొండపాటూరులోని శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఈఓ శ్రీనివాస్ ప్రకటించారు. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి ఆలయ ద్వారాలు మూసివేస్తామని, మరుసటి రోజు బుధవారం ఉదయం సంప్రోక్షణ అనంతరం తిరిగి దర్శనానికి అనుమతిస్తామని ఆయన తెలిపారు. భక్తులు ఈ మార్పును గమనించి సహకరించాలని ఆలయ కమిటీ కోరింది.
KRNL: ఉమ్మడి జిల్లాలో వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో హ్యాండ్ పంపులను సిద్ధం చేయడం, సుజల స్రవంతి మదర్ ప్లాంట్లను పనిలోకి తీసుకురావడం, తాగునీటి వనరులు లేని గ్రామాలకు నీరు అందించడంపై దృష్టి పెట్టాలని సూచించారు.
E.G: అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని MLA ముప్పిడి వెంకటేశ్వరరావు ఆదివారం తెలిపారు. కొవ్వూరులోని TDP కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాలకు తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాల కోసం నిధులు విడుదల చేసినట్లు వెల్లడించారు. సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
NDL: చెడు ప్రవర్తనకు స్వస్తి చెప్పి, సత్ప్రవర్తనతో మెలగాలని రౌడీ షీటర్లకు ఆళ్లగడ్డ ఎస్సై నగినా సూచించారు. ఆదివారం ఆళ్లగడ్డ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు ఎస్సై కౌన్సెలింగ్ ఇచ్చారు. ప్రస్తుతం వారు జీవిస్తున్న విధానం, జీవనోపాధికి చేస్తున్న వృత్తులపై సీఐ ఆరా తీశారు. నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
NDL: దిగువ అహోబిలంలో ఆదివారం రాత్రి శ్రీ ప్రహ్లాద వరద స్వామి, అమృతవల్లి అమ్మవార్ల కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు తిరుమల తిరుపతి దేవస్థానం తరపున పట్టు వస్త్రాలను సమర్పించారు. కళ్యాణ మహోత్సవంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి, మెజిస్ట్రేట్ భాస్కర్ తదితర ప్రముఖులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
SKLM: జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల నమోదు , పరిష్కార వేదిక మీ కోసం నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో అర్జీలు నమోదు చేసుకోవచ్చునని తెలిపారు. ఈ వేదికను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
TPT: పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై రేణిగుంట మండలం ఆర్. మల్లవరం బ్రిడ్జి వద్ద ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తిరుపతి వైపు వస్తున్న కారును వెనుక నుంచి గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో కారు అదుపుతప్పి పల్టీలు కొట్టి అవతలి రోడ్డుపై పడినట్టు సమాచారం. ఆ సమయంలో కారులో డ్రైవర్ ఒక్కడే ఉండగా.. స్వల్ప గాయాలతో బయటపడినట్టు తెలుస్తోంది.
ATP: జిల్లాలో గంజాయి, మత్తుపదార్థాల నియంత్రణపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అనంతపురం త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టీ కేఫ్‌లలో ఆదివారం రాత్రి డాగ్ స్క్వాడ్ బృందాలతో సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో అనుమానాస్పద వ్యక్తులు, నిషిద్ధ పదార్థాల నిల్వపై ప్రత్యేక దృష్టి సారించి సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు.
NDL: చాగలమర్రి మండలం పెద్దవంగలిలో శ్రీదస్తగిరి స్వామి ఉరుసు సందర్భంగా సోమవారం ఉదయం 9 గంటలకు నాలగు పళ్ల ఎద్దుల బండలాగుడు పోటీలు జరగనున్నట్లు దర్గా కమిటి ఓ ప్రకటనలో తెలిపింది. ఈ పోటీలలో ప్రతిభ కనబర్చిన ఎడ్ల యజమానులకు వరుసగా రూ. 30,116, రూ. 20,116, రూ.15,116, రూ.10, 016, రూ. 5,016, రూ.4,016 బహుమతులు ఇవ్వనున్నట్లు కమిటీ పేర్కొంది.
W.G: నరసాపురం జాతీయ రహదారిపై ఆదివారం గుర్తుతెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఒక ఆవు మృతి చెందగా, మరొకటి తీవ్రంగా గాయపడింది. యజమానులు పశువులను రోడ్లపై వదిలేయడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి, పశువుల యజమానులపై చర్యలు తీసుకోవాలని.. రహదారులపై పశువుల సంచారాన్ని నియంత్రించాలని స్థానికులు కోరుతున్నారు.
E.G: నిడదవోలు మండలం సమిశ్రగూడెం గీత మందిరం వద్ద 54వ హనుమాన్ చాలీసా పారాయణం ఘనంగా జరిగింది. శ్రీ రామదూత భక్త బృందం ఆధ్వర్యంలో 53 మంది దంపతులు సామూహికంగా చాలీసా పఠించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, సహస్రనామార్చనలు నిర్వహించారు. దెందులూరు సీతారామ శర్మ హనుమంతుని వైభవంపై ప్రవచనాలు చేయగా, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
AKP: చంద్రగ్రహణం కారణంగా ఈ నెల 3వ తేదీన అనకాపల్లి గవరపాలెం నూకాంబిక అమ్మవారి ఆలయాన్ని మూసివేసి దర్శనాలను నిలిపి వేస్తున్నట్లు ఆలయ చైర్మన్ పీలా నాగ శ్రీను ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు తలుపులు మూసివేస్తామని గ్రహణ మోక్ష కాలం అనంతరం 4వ తేదీ ఉదయం 6 గంటలకు ఆలయాన్ని తెరుస్తామన్నారు. సంప్రోక్షణ అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులను దర్శనానికి అనుమతిస్తామని పేర్కొన్నారు.