SKLM: కంచిలి నుంచి విశాఖపట్నానికి ఆరు పశువులను వ్యానులో తరలిస్తుండగా పలాస మండలం లక్ష్మీపురం టోల్ గేట్ వద్ద పోలీసులు పట్టుకున్నట్లు సీఐ రామకృష్ణ నిన్న తెలిపారు. పశువుల అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. పశువులు అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.
TPT: పెళ్లకూరు మండలంలోని చంబడి పాలెం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. రోడ్డు పక్కన వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో స్పాట్లో మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వాహనం వివరాల కోసం దర్యాప్తు ప్రారంభించారు.
KDP: ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ ఈనెల 5న జరగనుంది. ఈ కార్యక్రమానికి మాజీ CM YS జగన్ గురువారం ప్రొద్దుటూరు రానున్నారు. ఆయన బెంగుళూరు నుంచి బయలుదేరి ప్రొద్దుటూరు వస్తున్నారు. ఈ మేరకు జగన్ పీఏ నాగేశ్వరరావు రెడ్డి ప్రొద్దుటూరు పర్యటన వివరాలను అధికారికంగా విడుదల చేశారు.
ASR: జిల్లాలోని ప్రాథమిక రంగాల ఆర్థిక పురోగతి, నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనపై జిల్లా అధికార యంత్రాంగం సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. సోమవారం అధికారులతో వీసీ నిర్వహించారు. ఆర్థిక పనితీరు సాధనలో వెనుకబడిన శాఖలు దిద్దుబాటు చర్యలు చేపట్టాలన్నారు. వ్యవసాయ, ఉద్యానవన, మత్స్య, పట్టు శాఖలు లక్ష్యాలు నిర్ధేశించుకోవాలన్నారు.
నెల్లూరు: వరికుంటపాడు మండలంలో గండిపాలెం జలాశయం అధికారుల నిర్లక్ష్యంపై రైతులు మండిపడుతున్నారు. కాల్వల్లో పూడిక, కంపచెట్లు, ఆక్రమణలు తొలగించకుండానే నీరు విడుదల చేయడంతో 11 వేల ఎకరాలకు సాగునీరు అందడం లేదు. నీరంతా వృథాగా పోతుండగా, చివరి ఆయకట్టు రైతులకు కష్టాలు తప్పడం లేదు. వెంటనే కాల్వలు శుభ్రం చేసి సాగునీరు అందించాలని రైతులు, స్థానికులు కోరుతున్నారు.
KKD: గ్రామీణ అభివృద్ధిలో అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అధికారులను, నేతలను హెచ్చరించారు. పెదపూడి మండలం పైన గ్రామంలోని రోడ్డు పనులపై వచ్చిన ఫిర్యాదులపై ఆయన సోమవారం సాయంత్రం స్పందించారు. అక్రమాలకు తావులేకుండా పనులు చేపట్టాలని ఆదేశించారు. ఎమ్మెల్యే స్పందన పట్ల గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.
E.G: అనపర్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి స్థాయి పెంపుపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ తాడి రామగుర్రెడ్డి వ్యాఖ్యలు అవాస్తవమని మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి ఆరోపించారు. అనపర్తి వైసీపీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తాను ఎమ్మెల్యేగా ఉండగా 2022లో తిరిగి 100 పడకల స్థాయికి పెంచుతూ జీవో తీసుకొచ్చామని చెప్పారు.
NDL: ఆళ్లగడ్డ మండలం ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన ఎగువ అహోబిలంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం రథోత్సవం నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేతంగా జ్వాలా నరసింహస్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి రథంపై కొలువు తీర్చారు. అర్చకులు రథం వద్ద సంప్రదాయబద్ధంగా పూజలు చేసి శుభ ముహూర్తంలో రథాన్ని ముందుకు కదిలించారు.
W.G: జిల్లాలో శబ్ద, వాయు కాలుష్య నియంత్రణపై కలెక్టర్ నాగరాణి భీమవరంలో అధికారులతో సమీక్షించారు. ఉత్సవాలు, ఆలయాలు, ఆసుపత్రుల వద్ద బాణాసంచా కాల్చకుండా రెవెన్యూ, పోలీస్ శాఖలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాలుష్యం వల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కుటుంబ సర్వే, ఈ-కేవైసీ ప్రక్రియలను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.
KDP: ఇజ్రాయిల్–ఇరాన్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో విదేశాల్లో ఉన్న జిల్లాకు చెందిన పౌరుల భద్రతపై ప్రభుత్వం అప్రమత్తమైంది. యుద్ధ ప్రభావిత దేశాల్లో ఉన్న కడప జిల్లావాసులు లేదా వారి బంధువులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా వెంటనే సమాచారం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి తెలిపారు. సహాయం కోసం టోల్‌ఫ్రీ నంబర్ 08562-246344 ను సంప్రదించాలని సూచించారు.
CTR: ఏపీ సార్వత్రిక ఇంటర్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు చిత్తూరులోని ఒక పరీక్షా కేంద్రంలో చీటింగ్‌కు పాల్పడిన విద్యార్థిని డిబార్ చేసినట్లు ఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఇంగ్లీషు పరీక్షకు నమోదు చేసిన 1,660 మందిలో 1,361 మంది హాజరైనట్లు వెల్లడించారు. జిల్లాలోని 11 పరీక్షా కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీ చేసినట్లు అధికారులు తెలిపారు.
BPT: భట్టిప్రోలులో సోమవారం రాత్రి జరిగిన భ్రమరాంభ సమేత మల్లేశ్వర స్వామి రథోత్సవంలో ఎమ్మెల్యే నక్కా ఆనంద బాబు పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి ఆయన ఆశీస్సులు అందుకున్నారు. ఆధ్యాత్మిక వేడుకలు ప్రజల్లో ఐక్యతను పెంపొందిస్తాయని, సంప్రదాయాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
అన్నమయ్య: రామసముద్రం మండలం దిగువపేట వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మదనపల్లెకు చెందిన 70 ఏళ్ల చిరు వ్యాపారి ఖాదర్ వలీ మృతి చెందారు. ఖాదర్ వలీ బైక్‌పై వెళ్తుండగా ట్రాక్టర్ ఢీకొనడంతో ఆయన కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు 108 ద్వారా పుంగనూరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ELR: టి.నరసాపురం మండలం శ్రీరామవరంలో సోమవారం పోలీసులు పేకాట ఆడుతున్న 9 మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.3,150 నగదు స్వాధీనం చేసుకున్నట్లు హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు తెలిపారు. కేసు నమోదు చేసినట్లు చెప్పారు. మండల పరిధిలో జూదాలు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
KRNL: హోలీ పండుగ సందర్భంగా కర్నూలు మార్కెట్ కమిటీ యార్డుకు నేడు సెలవు ప్రకటించామని, రైతులు అమ్మకానికి తమ పంట ఉత్పత్తులను మార్కెట్ యార్డుకు తీసుకురావద్దని కర్నూలు మార్కెట్ కమిటీ సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ జయలక్ష్మి తెలిపారు. బుధవారం యథావిధిగా మార్కెట్ కమిటీ యార్డులో పంట ఉత్పత్తుల క్రయ విక్రయాలు జరుగుతాయన్నారు.