ATP: గుత్తి డీవైఈవోగా లక్ష్మన్న శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా వీరికి గుత్తి ఎంఈవో రవి నాయక్, కోట ఉన్నత పాఠశాల HM సుభాన్, ఉపాధ్యా యులు సురేశ్, ఖాజా బాషా, తదితరులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గుత్తి డివిజన్ పరిధిలో విద్యా రంగ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు.
SKLM: ఆమదాలవలస మండలం తోగరంలోని పేకాట శిబిరంపై ఎస్సై బాలరాజు ఆధ్వర్యంలో పోలీసులు ఆకస్మికంగా శుక్రవారం దాడి చేశారు. ఈ ఘటనలో పేకాట ఆడుతున్న 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.26,240 నగదు స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేశామన్నారు. నిందితుల వివరాలు తెలియాల్సి ఉంది.
GNTR: పెదకాకాని మండలం నంబూరు శివారులో గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతదేహం చాలా రోజులుగా ఉండటంతో పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో లభ్యమైంది. శుక్రవారం సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు ఎవరనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
విజయనగరం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ అకాడమిక్ సెల్‌ను శుక్రవారం ప్రారంభించినట్లు ప్రిన్సిపాల్ డా. బి. దేవి మాధవి తెలిపారు. 2025–26 విద్యా సంవత్సరానికి పీజీ విద్యార్థుల అకాడమిక్ కార్యకలాపాల సమన్వయం కోసం ఈ సెల్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమం ప్రారంబోత్సవంలో భాగంగా డా. వై. పద్మశ్రీ క్లినికల్ ప్రెజెంటేషన్ ఇచ్చారు.
TPT: జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా మహిళా డీఎస్పీ శ్రీలత ఆధ్వర్యంలో తిరుపతి పోలీస్ మైదానంలో మహిళల కోసం ప్రత్యేకంగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంప్‌లో మహిళలకు రక్తపరీక్షలు, బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి వైద్య సలహాలు అందజేశారు. మహిళలు పెద్ద ఎత్తున ఈ మెడికల్ క్యాంప్‌లో పాల్గొని సేవలను వినియోగించుకున్నారు.
అన్నమయ్య: అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా శుక్రవారం జ్ఞానాంబిక డిగ్రీ కళాశాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పాల్గొన్నారు. మహిళలపై జరిగే నేరాలను మొదటి దశలోనే అరికట్టాలని, సమాజం సహకారం అవసరమని కలెక్టర్ తెలిపారు. సోషల్ మీడియా వినియోగంలో విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ సూచించారు.
పల్నాడు: ఈ నెల 8న జిల్లాలో నిర్వహించనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా, విజయవంతంగా నిర్వహించాలని పల్నాడు కలెక్టర్ కృతిక శుక్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆమె డీఆర్వో, ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఐసీడీఎస్, మెప్మా, వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
కర్నూలు: జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి అక్రమ మైనింగ్ కార్యకలాపాలను పూర్తిగా అరికట్టాలని, మైనింగ్ అనుమతులను నిబంధనల ప్రకారం మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో రెవెన్యూ, మైనింగ్, అటవీ, పోలీస్ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పారదర్శక అనుమతుల మంజూరు చేయాలన్నారు.
CTR: ప్లాస్టిక్ కవర్లు విక్రయిస్తే దుకాణాలు సీట్ చేస్తామని శానిటరీ ఇన్‌స్పెక్టర్ ముని వెంకటప్ప, నవరత్నాలు హెచ్చరించారు. పుంగనూరు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం అధికారులు బృందాలుగా ఏర్పడి పట్టణంలోని వివిధ దుకాణాలు, హోటల్స్‌లో తనిఖీలు చేపట్టారు. దుకాణాల్లో విక్రయిస్తున్న నిషేదిత కవర్లను స్వాధీనం చేసుకున్నారు.
VSP: మహాత్మా జ్యోతిరావు ఫూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌లో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎంపీ శ్రీభరత్ అధికారులను ఆదేశించారు. గతంలో మంజూరైన రూ.13.5 కోట్లలో కొంతమేర పనులు మాత్రమే పూర్తయ్యాయని తెలిసి ఆయన పాఠశాలను సందర్శించారు. ఈమేరకు ప్రిన్సిపాల్, విద్యార్థులతో మాట్లాడి పరిస్థితులను పరిశీలించారు.
కోనసీమ: ప్రజల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా క్యాడర్ విత్ లీడర్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని రాజోలు నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జి గొల్లపల్లి అమూల్య తెలిపారు. రాజోలు మండలం తాటిపాకలో శుక్రవారం క్యాడర్ విత్ లీడర్ కార్యక్రమం నిర్వహించారు. ఆమె ప్రజలు, పార్టీ శ్రేణులు నుంచి అర్జీలు స్వీకరించారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు.
PPM: రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు రావాడ సీతారాం శనివారం జిల్లా కేంద్రానికి చేరుకోనున్నట్లు జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారిత అధికారి శ్యామల తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. మార్చి 7వ తేదీన ఉదయం 10.30 గంటలకు స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో అందుబాటులో ఉంటారని చెప్పారు. ఈ సందర్భంగా ఎస్సీ కులాల సంఘాల నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తారన్నారు.
ప్రకాశం: కంభం పట్టణంలోని సచివాలయం-2లో ఆధార్ సెంటర్‌ను సర్పంచ్ పల్నాటి బోడయ్య, ఎంపీడీవో వీరభద్రచారి, శుక్రవారం పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలు ఆధార్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో బ్రహ్మయ్య, సచివాలయ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.