జూనియర్ ఎన్టీఆర్… ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. ఆయన నటనకు దక్షిణాది తో పాటు.. ఉత్తరాది ప్రజలు కూడా ఫిదా అయిపోయారు. ఆయన సినిమాలపై ఫోకస్ పెట్టి… రాజకీయాలకు ఎంత దూరంగా ఉండాలని ప్రయత్నించినా కూడా.. ఆయన రాజకీయంగా హాట్ టాపిక్ అవుతూనే ఉన్నారు. మొన్నటికి మొన్న అమిత్ షా వచ్చి ఎన్టీఆర్ ని కలవడం రాజకీయంగా ఎంత సంచలనంగా మారిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
తాజాగా… ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ మళ్లీ ఎన్టీఆర్ ప్రకంపనలు మొదలయ్యాయి. మొదట్లో ఆయన కూడా.. ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం, టీడీపీకి మద్దతు తెలపడం లాంటివి చేశారు. కానీ.. ఇప్పుడు వాటికి దూరంగా ఉంటూ వస్తున్నారు. అయినప్పటికీ.. ఆ పేరు, ఫోటోలతో అభిమానుల హడావిడి చేస్తూ వస్తున్నారు. చంద్రబాబు దూరం పెడుతూ వస్తున్నా.. అభిమానులు మాత్రం వదలడం లేదు. తాజాగా.. చంద్రబాబు కుప్పంలో పర్యటిస్తుండగా.. అక్కడ కూడా ఎన్టీఆర్ ఫోటోలతో ఫ్లెక్సీలు దర్శనమిస్తుండటం గమనార్హం.
మరోవైపు.. తెలుగుదేశం పార్టీ పగ్గాలను జూనియర్ ఎన్టీఆర్ అందుకోవాలంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. దీనిపై మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరి కోసమో, ఎవరో అడిగారని జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు తీసుకోరని కొడాలి నాని స్పష్టం చేశారు.