ఏపీ, తెలంగాణ సహా ఏడు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టిస్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేస్తూ ప్రకటన చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలో కొలీజియం బుధవారం సమావేశం నిర్వహించింది. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ధీరజ్ సింగ్ ఠాకూర్, తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా అలోక్ ఆరాధేల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్‌ను ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా నియమించాలని కొలీజియం తెలిపింది.
హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ పీకే మిశ్రా మే నెలలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులవ్వడంతో ఆ పోస్టు ఖాళీగానే ఉంది. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరధేను తెలంగాణ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని కొలీజియం సూచించింది. మధ్యప్రదేశ్‌కు చెందిన జస్టిస్ అలోక్ 2009 డిసెంబరులో అదే రాష్ట్ర హైకోర్టుకు న్యాయమూర్తిగా నియమితులై ఆ తర్వాత 2018 నుంచి కర్ణాటక హైకోర్టులో విధులు నిర్వహిస్తున్నారు.
గుజరాత్‌కు మహిళా న్యాయమూర్తి సునీతా అగర్వాల్, బాంబేకి దేవేంద్రకుమార్ ఉపాధ్యాయ్, మణిపూర్‌కు సిద్ధార్థ్ మృదుల్, కేరళకు ఆశిష్ దేశాయ్, ఒరిస్సాకు సుబాసిస్ తలపత్రల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సూచిస్తూ ప్రకటన విడుదల చేసింది. అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేస్తున్న జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ్ పేరును బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొలీజియం సిఫారసు చేయగా అలహాబాద్ హైకోర్టు జడ్జీ సునీతా అగర్వాల్ పేరును గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సిఫారసు చేసింది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిద్ధార్థ్ మృదుల్ పేరును మణిపూర్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, గుజరాత్ హైకోర్టు జడ్జీ జస్టిస్ ఆశిష్ జే దాసాయి పేరును కేరళ హైకోర్టు న్యాయయూర్తిగా కొలీజియం సిఫారసు చేసింది. న్యాయమూర్తలందరూ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులుగా సరిపోతారని వెల్లడించింది.