టీడీపీ యువనేత నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర ఈ రోజు ఉదయం కానుంది. టీడీపీ శ్రేణులు యాత్రకు సంబంధించి ఏర్పాట్లు చేశాయి. నిన్ననే లోకేశ్ కుప్పం గెస్ట్ హౌస్ చేరుకున్నారు. ఉదయం 10.15 గంటల సమయంలో వరదరాజుల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. 11.03 గంటలకు పాదయాత్రను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు యువగళం బహిరంగ సభలో పాల్గొంటారు. సభకు 50 వేల మందికి పైగా టీడీపీ నేతలు వస్తారని చెబుతున్నారు. సభలో వేదికపై 400 మంది నేతలు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. సభ అనంతరం కుప్పం ప్రభుత్వ ఆసుపత్రి శెట్టిపల్లె క్రాస్, బెగ్గిలిపల్లె క్రాస్ మీదుగా యాత్ర కొనసాగుతుంది. తొలిరోజు పాదయాత్ర 8.5 కిలోమీటర్ల మేర కొనసాగనుంది.
కుప్పం నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర 3 రోజులు 29 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. కుప్పం తర్వాత పలమనేరు నియోజకవర్గంలో పాదయాత్ర సాగుతుంది. కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు సాగే పాదయాత్రలో ప్రతి నియోజకవర్గంలో 3 రోజుల పాటు జరగనుంది. ప్రతి నియోజకవర్గంలో బహిరంగ సభ నిర్వహిస్తారు. 400 రోజులపాటు 4 వేల కిలోమీటర్ల మేర సుధీర్ఘంగా పాదయాత్ర కొనసాగనుంది.
నారా లోకేశ్ యువగళం పాదయాత్ర తొలి రోజు (శుక్రవారం) షెడ్యూల్ ఇలా ఉంది.
ఉదయం 10-30 – కుప్పం ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ నుంచి వరద రాజస్వామి గుడికి నారా లోకేశ్ చేరుకుంటారు. ఉదయం 11.03 – ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆలయ ఆవరణలో పెద్దల నుంచి ఆశీర్వచనం తీసుకుంటారు. అక్కడినుంచి పాదయాత్రకు శ్రీకారం చుడతారు. ఉదయం 11.30 – సమీపంలో గల మసీదులో ప్రార్థనలు. ఉదయం 11.55 – హెబ్రాన్ హౌస్ ఆఫ్ వర్షిప్ చర్చిలో ప్రార్థనలు. మధ్యాహ్నాం 12.45 – డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు. మధ్యాహ్నాం 1.05 – కుప్పం బస్ స్టేషన్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు. మధ్యాహ్నాం 1.25 – కొత్త బస్ స్టేషన్ వద్ద పొట్టి శ్రీరాములు, మహాత్మాగాంధీ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు. మధ్యాహ్నాం 3.00 – హెచ్ పీ పెట్రోలు బంకు సమీపంలో బహిరంగసభ. సాయంత్రం 4.30– ట్రాఫిక్ ఐలాండ్ జంక్షన్ నుంచి పాదయాత్ర కొనసాగింపు. కుప్పం ప్రభుత్వాసుపత్రి క్రాస్, శెట్టిపల్లి క్రాస్, బెగ్గిలపల్లి క్రాస్, పీఇఎస్ మెడికల్ కాలేజి సమీపంలో క్యాంప్ సెట్‌కు చేరిక. సాయంత్రం 6.45 – పీఇఎస్ మెడికల్ కాలేజీ సమీపంలో క్యాంప్ సైట్ వద్ద విరామం.
తొలి రోజు యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ 8.5 కిలోమీటర్ల మేర నడుస్తారు.