Nara Bhuvaneswari: మేలుకో తెలుగోడా పేరుతో బస్సుయాత్ర!
అక్టోబరు మొదటి వారంలో నారా భువనేశ్వరి ఓ "బస్సు యాత్ర"ను ప్రారంభించనున్నట్లు తెలిసింది. అంతేకాదు అందుకోసం ఇప్పటికే రోడ్ మ్యాప్ సైతం పార్టీ వర్గాలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అయితే చంద్రబాబు నాయుడు విడుదల ఆలస్యం పరిణామాల నేపథ్యంలో పార్టీ వర్గాలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఏపీ రాజకీయాల్లో సరికొత్త పరిణామం చోటుచేసుకోబోతుంది. మరికొన్ని రోజుల్లో నారా భువనేశ్వరి(Nara Bhuvaneswari) మేలుకో తెలుగోడా అనే పేరుతో బస్సు యాత్ర(Bus Yatra)కు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ బస్సు యాత్ర ద్వారా అన్ని జిల్లాల్లో పర్యటించి ప్రజలతో మమేకం కావాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ యాత్రకు సంబంధించిన సమగ్ర రోడ్‌మ్యాప్‌ను పార్టీ సీనియర్ నేతలు రూపొందించారు. ఈ బస్సు యాత్ర వారం రోజుల పాటు జరగనున్నట్లు సమాచారం. అంతేకాదు ఈనెల 5 వ తేదీ నుంచి చంద్రబాబునాయుడు నియోజకవర్గమైన కుప్పం నుంచి ఈ బస్సు యాత్ర మొదలవుతుందని టీడీపీ వర్గాలు అంటున్నాయి. ఈ యాత్ర మొదట రాయలసీమలో కొనసాగుతుందని, ఈ బస్సు యాత్రలో నారా బ్రాహ్మణి కూడా పాల్గొంటారని, వీరిద్దరూ కలిసి టీడీపీ ప్రచారానికి సారథ్యం వహించబోతున్నారని తెలిసింది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తు ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా ఒకరోజు నిరహార దీక్ష చేసేందుకు నారా భువనేశ్వరి సిద్ధమయ్యారు.
అయితే స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్టు కాగా ప్రస్తుతం జైలులోనే ఉన్నారు. మరోవైపు నారా లోకేష్ సైతం ఢిల్లీలోనే ఉన్నారు. ఒకవేళ లోకేష్ ఏపీకి వచ్చినా కూడా అరెస్టు చేసే అవకాశం ఉందని పలువురు టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో పార్టీని ముందుండి నడిపించడానికి ఉన్న ఏకైక మార్గం నారా భువనేశ్వరి, నారా నారా బ్రహ్మణి. వీరి ద్వారా టీడీపీపై క్రమంగా ప్రజల్లో సానుభూతి పెంచాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నారా బ్రాహ్మణి నిత్యం టీడీపీ, జనసేన నేతలతో సమావేశమవుతున్నారు. రాబోయే రోజుల్లో ఆమె టీడీపీలో మరిన్ని కార్యక్రమాలు చేయడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. అయితే CBN ఇప్పట్లో జైలు నుంచి విడుదలయ్యే అవకాశం లేదని, అందుకే వారి కుటుంబ సభ్యులచే బస్సు యాత్రకు సిద్ధమవుతున్నారని ఇంకొంత మంది చెబుతున్నారు.