MLC Shaik Sabji: అధికారిక లాంఛనాలతో ముగిసిన అంత్యక్రియలు
ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ అంత్యక్రియలను ఏలూరులో అధికారిక లాంఛనాలతో ఈరోజు పూర్తయ్యాయి. రెండు రోజుల క్రితం పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే.
MLC Shaik Sabji: ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో ఈరోజు ఏలూరులో పూర్తయ్యాయి. సాబ్జీ కుమార్తె ఆస్రిఫా అమెరికా నుంచి ఆదివారం ఉదయం ఏలూరుకు రావడంతో ఆయన అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారు. సాబ్జీ భౌతికకాయాన్ని ఆసుపత్రి నుంచి నేరుగా ఏలూరులోని యూటిఎఫ్ జిల్లా కార్యాలయానికి తరలించారు. అక్కడ కొద్దిసేపు ఉంచి తర్వాత ఇండోర్ స్టేడియానికి తీసుకెళ్లారు. ఆయన భౌతికకాయాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సీపీఎం నాయకులు, ఎమ్మెల్సీలు ఐ.వెంకటేశ్వరరావు, కె.లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్సీ వి.బాలసుబ్రమణ్యం, యూటిఎఫ్ రాష్ట్ర నాయకులు, సీఐటీయూ, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, ప్రజాసంఘాలకు చెందిన నాయకులు, జిల్లా ఉన్నతాధికారులు సందర్శించి నివాళులర్పించారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ రెండు రోజుల కిందట మరణించారు. ఆయన మరణంపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. షేక్ సాబ్జీది యాక్సిడెంట్ కాదు.. హత్య అని ఆయన కొడుకు, సోదరుడు ఆరోపించారు. వచ్చే ఎన్నికల ముందు ఉపాధ్యాయులకు మద్ధతుగా ఉండే ఎమ్మెల్సీని కావాలనే అంతమొందించారని ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. ఎమ్మెల్సీ కారును ఢీకొట్టిన కార్ డ్రైవర్ స్వామిని కూడా పోలీసులు విచారిస్తున్నారు.