IND vs SA : తొలి వన్డేలో సౌతాఫ్రికాపై భారత్ ఘన విజయం
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భారత్ విజయంతో శుభారంభం చేసింది. ఆదివారం జోహన్నెస్‌బర్గ్‌లోని న్యూ వాండరర్స్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరిగింది.
IND vs SA : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భారత్ విజయంతో శుభారంభం చేసింది. ఆదివారం జోహన్నెస్‌బర్గ్‌లోని న్యూ వాండరర్స్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 27.3 ఓవర్లలో 116 పరుగులకే కుప్పకూలింది. ఫాస్ట్ బౌలర్లు అర్ష్‌దీప్ సింగ్, అవేశ్ ఖాన్ బౌలింగ్‌లో ప్రత్యర్థి జట్టుపై విరుచుకుపడ్డారు. అర్ష్‌దీప్ 10 ఓవర్లలో 37 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. అవేశ్ 8 ఓవర్లలో 27 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ తీశాడు. ఆతిథ్య దక్షిణాఫ్రికా తరఫున ఆండిలే ఫెహ్లుక్వాయో టాప్ స్కోర్ చేశాడు. 49 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 33 పరుగులు చేశాడు. ఓపెనర్ టోనీ డిజార్జ్ 28 పరుగులు చేశాడు. ఏడుగురు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు రెండంకెల స్కోరును అందుకోలేకపోయారు. రీస్ హెండ్రిక్స్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, వియాన్ ముల్డర్ ఖాతాలు తెరవలేదు. దక్షిణాఫ్రికా భారత్‌కు 117 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
దక్షిణాఫ్రికాపై భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 117 పరుగుల లక్ష్యాన్ని భారత్ 16.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి సులువుగా ఛేదించింది. రితురాజ్ గైక్వాడ్ 5 పరుగుల వద్ద అవుటయ్యాడు. అతడిని నాలుగో ఓవర్లో వియాన్ మల్డర్ అవుట్ చేశాడు. అనంతరం అరంగేట్రం చేసిన సాయి సుదర్శన్, శ్రేయాస్ అయ్యర్ అద్భుతంగా ఆడారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 88 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 16వ ఓవర్లో అయ్యర్ వికెట్ కోల్పోయాడు. 45 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 52 పరుగులు చేసి విజయ ఇన్నింగ్స్ ఆడాడు. సుదర్శన్ 33 బంతుల్లో 9 ఫోర్లతో అజేయంగా 55 పరుగులు చేశాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో భారత్ గెలిచి 1-0 ఆధిక్యంలో నిలిచింది.