»Michaung Cyclone Alert Oncoming Storm Red Alert For These Districts In Ap
Michaung Cyclone Alert: దూసుకొస్తున్న తుఫాన్..ఏపీలో ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
కోస్తా జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఏపీపై తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటుంది. కోస్తా రాయలసీమకు భారీ వర్ష సూచన ఉంది. నాలుగు, ఐదు, ఆరు తేదీల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభావంతో పలు చోట్ల వానలు కురియనున్నట్లు తెలిపారు.
Michaung Cyclone Alert: నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం తుఫాన్‌గా మారింది. నెల్లూరుకి ఆగ్నేయంగా 330 కి.మీల, బాపట్లకు దక్షిణ ఆగ్నేయంగా 440కి.మీల, మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 450 కి.మీల దూరంలో ఏర్పడిన ఈ మిచౌంగ్ తుఫాన్ రేపు తీవ్రంగా బలపడనుంది. ఈరోజు మధ్యాహ్నం నెల్లూరు, మచిలీపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావారణ శాఖ తెలిపింది. తుఫాన్ తీరం దాటే సమయంలో రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపించడంతో పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. సముద్ర తీరాల్లో ఆదివారం నుంచే అలల తీవ్రత భారీగా పెరిగింది. ఈ మిచౌంగ్ తుఫాన్ ప్రభావం ఎక్కువగా రాయలసీమ, దక్షిణ కోస్తాలో ఉంది. గంటకు 90-110 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశముంది.
గత రెండు రోజుల నుంచి నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలో అతి భారీ వర్షాలు కురిశాయి. రానున్న రెండు, మూడు రోజులపాటు కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురిచే అవకాశాలు ఉన్నాయి. తుఫాన్ ప్రభావం కారణంగా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో తీవ్రంగా ఉన్నందున తిరుపతి, పొట్టి శ్రీరాముల నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. రెండు రోజుల పాటు రాష్ట్రమంతా అతిభారీ వర్షాలు కురవడంతో పాటు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వరిపంట చేతికి వచ్చే సమయంలో ఇలాంటి వర్షాలు కురిస్తే తమకు నష్టం తప్ప ఇంకేం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రానికి కూడా వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో కొన్ని చోట్ల చిరుజల్లులు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది. ఇప్పటికే రాష్ట్రంలో వాతావరణం మారిపోయింది. చలి గాలులు ఎక్కువగా వీస్తున్నాయి.