తెలుగు దేశం అధినేత చంద్రబాబు(Chandrababu)ను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఏపీ వ్యాప్తంగా ఆ పార్టీ నేతలు ‘సత్యమేవ జయతే’ పేరుతో ఒక్కరోజు దీక్ష చేపట్టారు.రాజమండ్రి జైలులో చంద్రబాబు,ఢిల్లీలో నారా లోకేశ్(Nara Lokesh), రాజమహేంద్రవరంలోని క్వారీ సెంటర్ వద్ద భువనేశ్వరి, మంగళగిరి పార్టీ ఆఫీసులో రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Achennaidu), ముఖ్యనేతలు దీక్షలో కూర్చొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా తొలుత ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దీక్ష చేపట్టారు. ఈ దీక్ష సాయంత్రం 5గంటల వరకు కొనసాగనుందని టీడీపీ (TDP) అధిష్టానం ప్రకటించింది.
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణంలో చంద్రబాబు నాయుడును సెప్టెంబర్ 9న సీఐడీ (CID) అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ కస్టడీలోనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఈ కుంభకోణం జరిగినట్లు సీఐడీ పేర్కొంది. రాష్ట్రంలో స్కిల్ డెవలప్ మెంట్ (Skill development) సెంటర్ల ఏర్పాటుకు విడుదల చేసిన రూ.371 కోట్లను డొల్ల కంపెనీలకు మళ్లించారని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను టీడీపీ అధినేత ఖండించారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (High Court) గతవారం కొట్టివేసింది. హైకోర్టు తీర్పును ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.