Lion Attack in Tirupati Zoo : తిరుపతి జూలో సింహం ఎన్‌క్లోజర్‌లోకి దూకిన వ్యక్తి మృతి
రాజస్థాన్‌కి చెందిన ప్రహ్మద్ గుర్జర్ అనే వ్యక్తి స్వయంగా సింహం ఎన్‌క్లోజర్‌లోకి దూకాడు. అక్కడున్న మగ సింహం దాడి చేయడంతో అక్కడే ప్రాణాలు విడిచాడు. వివరాల్లోకి వెళితే....
Lion Attack Man Dead in Tirupati Zoo Park: తిరుపతిలో సింహం దాడిలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలవరపరిచింది. రాజస్థాన్‌కు చెందిన 38 ఏళ్ల ప్రహ్లాద్ గుర్జర్ అనే వ్యక్తి గురువారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో తిరుపతి ఎస్వీ జూ పార్క్‌లోని(Tirupati sv Zoo Park) లయన్ ఎన్‌క్లోజర్ వద్దకు చేరుకున్నాడు. ఎన్‌క్లోజర్ వద్ద ఉన్న వాటర్ ట్యాంకు దగ్గర ఉన్న గోడను దూకేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో భద్రతా సిబ్బంది అతనిని చూశారు. ఆ సమయంలో అతడు మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది.
అక్కడున్న భద్రతా సిబ్బంది ఎన్‌క్లోజర్‌లోకి దూకొద్దంటూ కేకలు వేశాడు. అయినా పట్టించుకోకుండా ప్రహ్లాద్ లోపలికి దూకేశాడు. అక్కడున్న మగ సింహం అతడిపై దాడికి దిగింది. అక్కడున్న సిబ్బంది పై అధికారులకు సమాచారం అందించారు. ఆపై అతడిని సింహం బారి నుంచి కాపాడేందుకు ప్రయత్నించారు. అవేమీ ఫలించలేదు. సింహం అతడిని పట్టుకుని ఎన్‌క్లోజర్‌లో ఉన్న ఓ మూలకు తీసుకు వెళ్లింది. దారుణంగా దాడి(Lion Attack) చేయడంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.
ఇదంతా జరగడానికి కేవలం పది నిమిషాల సమయం మాత్రమే పట్టింది. అతడి దగ్గర దొరికిన ఐడీ కార్డులు, ఆధార్ కార్డు తదితర ఆధారాల ఆధారంగా మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. మృతుడు వృత్తిరీత్యా డ్రైవర్‌గా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 13వ తేదీన అతడు తిరుపతికి వచ్చాడు.