ఏపీ రిటైర్డ్ డీజీపీ గౌతం సవాంగ్ (Gautham Sawang) తనయుడు వివాదంలో చిక్కుకున్నాడు. జూబ్లీహిల్స్‌లో రోడ్డు నెంబర్ 10లో ఓ పబ్ బయట ఘర్షణ కలకలం రేపింది. రాత్రి రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఓ యువతి విషయంలో ఇరు వర్గాలు ఒకరిపై మరొకరు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో పాల్గొన్న ఓ వర్గంలో సిద్ధార్థ మాగ్నమ్ (Siddhartha Magnum) ఉండగా.. మరో వర్గంలో పీ గౌతమ్ సవాంగ్ కుమారుడు డేవిడ్ సవాంగ్ ఉన్నట్లు సమాచారం. పబ్(Pub)లో వీరి మధ్య వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. కాసేపటి తరువాత బయటకు వచ్చి మద్యం మత్తులో ఇరు వర్గాలు పరస్పరం దాడులకు దిగినట్లు సమాచారం. ఈ ఘటనలో సిద్ధార్థ, డేవిడ్‌కు గాయాలయ్యాయి. దాడుల గురించి సమాచారం అందడంతో జూబ్లీహిల్స్ (Jubilee Hills) పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
అప్పటికే ఇరువర్గాలు అక్కడి నుంచి వెళ్లిపోయాయి. పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని జూబ్లీహిల్స్ పోలీసులు వెల్లడించారు. డేవిడ్ సవాంగ్ (David Sawang) మాజీ ప్రియురాలితో డేటింగ్ చేస్తున్న సిద్దార్థ అనే యువకుడు తన ఆరుగురు స్నేహితులతో కలిసి పబ్‌కు వచ్చాడు. ఇరువురు ఎదురెదురు పడటంతో గొడవ మొదలయ్యింది. దాంతో డేవిడ్ తన స్నేహితులతో కలిసి సిద్దార్థపై దాడి చేశాడు. దీంట్లో సిద్దార్థకు గాయాలయ్యాయి. కాగా, జూబ్లీహిల్స్ (Jubilee Hills) పోలీస్ స్టేషన్‌కు వచ్చిన డేవిడ్ జరిగిన గొడవపై ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో పోలీసులు సిద్దార్థను పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు.