ఏపీలో వచ్చే ఏడాది జూన్ లోపు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే అధికార వైఎస్సార్సీపీ(YSRCP) పార్టీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ ఎన్నికల్లో కచ్చితంగా 175కు 175 స్థానాలు గెలవాలని వైసీపీ నేతలకు సూచించారు. ఇటీవల కుప్పుం నియోజకవర్గం నేతలతో సైతం జగన్(jagan) ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దీంతో కుప్పం(kuppam)లో ఏడుసార్లు గెలిచిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(chandrababu naidu)ను ఓడించేందుకు ఇప్పటి నుంచి ప్లాన్స్ వేస్తున్నట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో ఎలాగైనా కుప్పంలో గెలవాలని వైసీపీ కసరత్తు చేస్తుంది. ఈ క్రమంలో అసలు కుప్పం నియోజకవర్గంలో ఈసారి ఎవరెవరో పోటీ చేయనున్నారు? కుప్పంలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఈ నియోజకవర్గంలో ప్రధానంగా ఉన్న సమస్యలెంటో ఇప్పుడు చుద్దాం.
కాంగ్రెస్, బీజేపీ
కుప్పం నియోజకవర్గంలో ఈసారి సీఎం జగన్ మోహన్ రెడ్డి మంత్రి పెద్దిరెడ్డిని రంగంలోకి దించనున్నట్లు తెలుస్తోంది. గతంలో స్థానిక నేత అయిన కేఎస్ భరత్ కు వైఎస్సార్సీపీ పార్టీ మద్దతుగా నిలిచింది. 2019 ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన వైఎస్సార్ పార్టీ అభ్యర్థి చంద్రమౌళి మరణం తర్వాత తన కుమారుడు భరత్ ను జగన్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపిక చేశారు. కానీ వచ్చే ఎన్నికల్లో భరత్ కు బదులు పెద్దిరెడ్డిని నిలబెట్టనున్నట్లు సమాచారం. ఇక కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఈ నియోజకవర్గంపై పెద్దగా ఫోకస్ చేసినట్లు కనిపించడం లేదు. నామ మాత్రంగా ఎన్నికల సమయానికి సాధారణ అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక జనసేన పార్టీ గతంలో బీజేపీతో పోత్తు పెట్టుకుంది. కానీ ఈసారి మాత్రం పొత్తుల గురించి ఎన్నికల సమయం వచ్చే నాటికి క్లారిటీ ఇస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు.
ఎలాగైనా గెలవాలని
కుప్పం నియోజకవర్గంలో 1989 నుంచి 2019 ఎన్నికల వరకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే వరుసగా ఏడు సార్లు గెలుస్తూ వచ్చారు. 2019 ఎన్నికల్లో టీడీపీ(TDP) అధినేత చంద్రబాబుకు 1,00,146 ఓట్లు రాగా, వైఎస్సార్ పార్టీ అభ్యర్థి చంద్రమౌళికి 69,424 ఓట్లు వచ్చాయి. ఇక కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ బాబుకు 3,839 ఓట్లుతో మూడో స్థానంలో నిలిచారు. కానీ వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో గెలిచేందుకు సీఎం జగన్ గట్టిగా కృషి చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే కుప్పం నియోజకవర్గంలో ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పార్టీ ఘన విజయం సాధించింది. అంతేకాదు చంద్రబాబు కంటే ఈ నియోజకవర్గాన్ని ఎక్కువగా అభివృద్ధి చేశామని జగన్ వ్యాఖ్యానించారు.
నువ్వా నేనా?
మరోవైపు గతంలో మాదిరిగా చంద్రబాబుకు కుప్పంలో అనుకూల పరిస్థితులు లేవని పలువురు అంటున్నారు. చంద్రబాబు నాయుడు ఎక్కువగా ఫోకస్ చేయకపోతే తన గెలుపు అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఈ క్రమంలో కుప్పంలో ప్రధానంగా ఈ రెండు పార్టీలే నువ్వా నేనా అన్నట్లుగా గెలుపు కోసం పోటీ పడనున్నట్లు కనిపిస్తోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో పరిస్థితి మారుతుందా లేదా ప్రజలు మళ్లీ బాబునే గెలిస్తారా లేదా మరో కొత్త వ్యక్తికి అవకాశం ఇస్తారో లేదో తెలియాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే.
ప్రధాన సమస్యలు
అక్రమ గ్రానైట్ తవ్వకాలు, భూ కబ్జాలు, పలు చోట్ల అధ్వాన రోడ్లు, కాలువలు మరమ్మతు సహా పలు సమస్యలు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. మరోవైపు పలువురు నేతలు పర్యటించినప్పుడల్లా శాంతి భద్రతల సమస్య, గొడవలు జరిగి పలు ప్రాంతాలు గందరగోళంగా మారుతున్నాయని అంటున్నారు. అయితే కుప్పం నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉందని చెప్పవచ్చు. ఇది ఏపీలోనే చిట్టచివరి శాసనసభ నియోజకవర్గం. చిత్తూరు లోక్ సభ నియోజకవర్గంలో ఇది భాగంగా ఉంది. 2019 ఎన్నికల ప్రకారం కుప్పంలో 2 లక్షల 13 వేల 329 మంది ఓటర్లు ఉన్నారు.