నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి చంద్రకిషోర్ రెడ్డి పైన మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రవి టీడీపీలో చేరేందుకు ప్లాట్ఫామ్ సిద్ధం చేసుకుంటున్నారని సంచలన ఆరోపణ చేశారు. తమ పార్టీ నేతలతో ఆయన టచ్లో ఉన్నారని, కానీ తాము ఈ నెల 4న ఆయన అక్రమాలు అన్నింటిని ఆధారాలతో సహా బయటపెడతామని హెచ్చరించారు. మాపై ఏవైనా ఆరోపణలు చేసేముందు, అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు ఆధారాలు తీసుకు రావాలని సవాల్ చేశారు. ఒక పార్టీలో ఉంటూ, మరో పార్టీ వారితో చర్చలు జరపడం ఏమిటో చెప్పాలన్నారు. జగన్ పైన ఒట్టేసి, నేను వైసీపీని వదిలేసే ప్రసక్తి లేదని చెప్పగలరా అని నిలదీశారు. అలా చేయలేదంటే టీడీపీలోకి వస్తున్నారని, ఆ విషయాన్ని ఇక వైసీపీ చూసుకోవాలన్నారు.
మేం రవిపై మాట్లాడిన ప్రతి మాటకు ఆధారాలు చూపించేందుకు సిద్ధమని చెప్పారు. ఎమ్మెల్యే రవికి సత్తా ఉంటే, ఆయన కుటుంబంపై ఆయనకు అంత నమ్మకముంటే రాజీనామాకు సిద్ధమా అని సవాల్ చేశామని గుర్తు చేశారు. ఆయన తన స్థాయిని మించి మాట్లాడుతున్నారని, బుద్ధి చెప్పేందుకు తాము సిద్ధమన్నారు. నంద్యాల ఎమ్మెల్యే లేదా ఆళ్లగడ్డ ఎమ్మెల్యేలు ఈ కాలాన్ని మంచి అవకాశంగా తీసుకొని, మా మీద ఏవైనా అవినీతి ఆరోపణలు ఉంటే ప్రూవ్ చేయాలని సవాల్ చేశారు. దమ్ముంటే మీరు వైసీపీని విడిచి రావాలని, మేం టీడీపీని విడిచి వస్తామని, పార్టీలకతీతంగా ప్రజల ముందుకు వెళ్లి తేల్చుకుందామని చెప్పారు. కౌన్సిల్ హాలులో ఎమ్మెల్యే సతీమణి నాగిని రెడ్డి… టీడీపీ కౌన్సిలర్లను గొర్రెలు అనడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. అక్కడ సమస్యలు చెప్పకుండా… మీ భజన చేస్తారా అని ప్రశ్నించారు. గొర్రెలు అనడంపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మూడు రోజుల పాటు ఏసీబీ రైడ్స్ జరిగితే నోరు విప్పకుండా ఉన్న ఘనత మీ పార్టీది అని, అందుకే నీ చూపు అంతా టీడీపీ వైపు ఉందని దుయ్యబట్టారు.