తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని నంద్యాల పోలీసులు శనివారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. నంద్యాల రేంజ్ డీఐజీ రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో సీఐడీ పోలీసులు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో చంద్రబాబును అదుపులోకి తీసుకునేందుకు బస చేసిన పట్టణంలోని ఆర్కే ఫంక్షన్ హాల్ శిబిరం వద్దకు చేరుకున్నారు. అయితే అక్కడ పెద్ద ఎత్తున తరలివచ్చిన టీడీపీ కార్యకర్తల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఆ క్రమంలో బస్సు నుంచి బయటకు వచ్చిన చంద్రబాబుతో పోలీసులు మాట్లాడి అదుపులోకి తీసుకున్నారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో చంద్రబాబును అరెస్ట్ చేస్తున్నట్లు డీఐజీ తెలిపారు. ఆ క్రమంలో అసలు తనని ఏ చట్టం ప్రకారం అరెస్టు చేస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రాథమిక ఆధారాలు లేకుండా ఎలా అదుపులోకి తీసుకుంటారని నిలదీశారు.
మరోవైపు కేసు పేపర్లు ఇవ్వాలని, ఎఫ్ఐఆర్ కాపీ చూపించాలని లాయర్లు కోరారు. కానీ రిమాండ్ రిపోర్ట్ ఇవ్వలేమని పోలీసులు చెప్పారు. అయితే అరెస్టుకు గల కారణాన్ని పోలీసులు వెల్లడించారు. మరోవైపు పోలీసులు అరెస్ట్ నోటీసు ఇచ్చామని చెబుతున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో చంద్రబాబు నాయుడు ఏ1గా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు చంద్రబాబుతోపాటు భూమా అఖిల ప్రియ, జగత్ విఖ్యాత్ రెడ్డి, ఏవీ సుబ్బారెడ్డి, బీసీ జనార్ధన్ రెడ్డి, భూమా బ్రహ్మానందరెడ్డి సహా పలువురు టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.