టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ(Bhuma Akhila Priya) అనారోగ్యం బారిన పడ్డారు. విషయం తెలుసుకున్న అధికారులు ఆమెను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అఖిల ప్రస్తుతం కర్నూల్ సబ్ జైల్లో ఉన్న క్రమంలో ఈ సంఘటన జరిగింది.
తెలుగుదేశం పార్టీ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ(Bhuma Akhila Priya) అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. టీడీపీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డిపై దాడి కేసులో ఆమె ఇటీవల అరెస్టయింది. కోర్టు ఆమెకు రిమాండ్ విధించడంతో కర్నూల్ సబ్ జైల్లో అఖిల ప్రియను ఉంచారు. ఈ క్రమంలోనే ఆమె అనారోగ్యానికి గురికావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే వైద్యులు పరీక్షలు నిర్వహించిన నివేదికలు అందాల్సి ఉంది.
టీడీపీ నేత నారా లోకేష్ (Nara Lokesh) పాదయాత్ర నంద్యాలకు చేరుకున్న క్రమంలో ఏవీ సుబ్బారెడ్డిపై ఆ పార్టీకే చెందిన భూమా అఖిలప్రియ వర్గీయులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ఏవీ సుబ్బారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం, ఘటనపై కేసు నమోదు చేసిన నంద్యాల పోలీసులు.. ప్రాథమిక దర్యాప్తు అనంతరం భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్‌రామ్, ఆమె అనుచరులను అరెస్ట్ చేశారు. ఏవీ సుబ్బారెడ్డిపై దాడి జరిగిన ఘటనలో అఖిలప్రియను అరెస్ట్ చేసి పాణ్యం పోలీస్ స్టేషన్(Panyam Police Station) కు తరలించారు పోలీసులు. సెక్షన్ 307 కింద అఖిలప్రియపై కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఆమెను కోర్టులో హాజరుపరిచారు. అఖిలప్రియ దంపతులిద్దరికీ కోర్టు రిమాండ్ విధించింది.
మరోవైపు ఏవీ సుబ్బారెడ్డి కూడా తనతో అసభ్యంగా ప్రవర్తించారని, చున్నీ పట్టుకుని లాగాడని ఆమె ఆరోపించారు. తనతో అసభ్యంగా ప్రవర్తించడం వల్లే దాడి చేశారని భూమాకు చెందిన పలువురు అంటున్నారు.