నంద్యాల జిల్లాలో భూమా అఖిలప్రియ వర్సెస్ ఎమ్మెల్యే రవిచంద్రకిశోర్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. రవి అక్రమాలు చేశారని అఖిలప్రియ ఆరోపణలు చేయగా.. ఎమ్మెల్యే ధీటుగా స్పందించారు. అక్రమాలకు సంబంధించి ఆధారాలు చూపించాలని కోరారు. తన ఆస్తుల విలువ పెరిగితే మీకెందుకు బాధ? అని ప్రశ్నించారు. తాను గౌరవంగా, గర్వంగా ఆస్తులు సంపాదించుకున్నానని శిల్ప రవి వివరించారు. తన ఇల్లు, నంద్యాల ఆస్తులకు సంబంధించి నయా పైసాను ఎలక్షన్ అఫిడవిట్, ఇన్ కం టాక్స్‌లో చూపించే కొన్నామని తెలిపారు.
సింపతితో గెలిచారు.. కాదా?
శోభనాగిరెడ్డి చనిపోతే సింపతితో గెలిచారని భూమా అఖిలప్రియను శిల్పా రవి కామెంట్ చేశారు. ఎవరు ఎప్పుడు రాజకీయాల్లో వచ్చారు.. ఎవరెవరిని కలిశారనే అంశానికి సంబంధించి తమ వద్ద డేటా ఉందని అఖిలప్రియ అన్నారు. అమ్మ చనిపోయిందని.. సానుభూతితో గెలిచారని చెప్పడం కూడా తప్పేనా అని శిల్పా రవి ప్రశ్నిస్తున్నారు. ఎందుకు అంతా ఉలికిపాటు అని నిలదీశారు. శిల్పా రవి అరాచకాలపై బుక్ ప్రింటింగ్ చేస్తున్నామని.. అందరికీ పంచుతామని అఖిలప్రియ చెబుతున్నారు. బ్యాంక్ వాళ్లు అఖిలప్రియ ఇంటి వద్ద ధర్నా చేయలేదా అని శిల్ప రవి అడిగారు. రూ.11 కోట్లు కట్టాలన్నది నిజం కాదా అని నిలదీశారు. నోటీసు ఇవ్వలేదా? అది ఎవరి సొమ్ము అని అడిగారు. విజయ డైరీకి సంబంధించి 1.40 కోట్లు ఎలా వాడుకుంటారని ప్రశ్నించారు. జగత్ డైరీ ఎందుకు మూత పడిందన్నారు. విజయ్ డైరీని తాము టేకోవర్ చేసిన తర్వాత లాభాలు వస్తున్నాయని పేర్కొన్నారు.
ప్రత్యర్థి శిల్పనే
అధికారంలో ఉన్నా.. లేకున్నా, ఎమ్మెల్యేగా గెలిచిన, గెలవకున్నా శిల్పా కుటుంబాన్ని వదిలేది లేదన్నారు భూమా అఖిలప్రియ. తన ప్రత్యర్థి శిల్ప రవి అని స్పష్టంచేశారు. గతంలో అధికారంలో ఉన్నా లేకున్నా సరే.. కార్యకర్తలను కాపాడుకున్నామని చెప్పారు. తమకు అధికారం ముఖ్యం కాదని.. వారు అధికారం కోసం విర్రవీగుతారని చెప్పారు. దీనిపై శిల్ప రవి స్పందిస్తూ.. 2017లో అధికార పార్టీలో చేరింది మీరు కాదా? మంత్రి పదవీ కావాలని అడిగింది మీరు కాదా? అన్నారు. అఖిలప్రియ స్పందిస్తూ.. వైఎస్ చనిపోగానే చంద్రబాబు పక్షాన చేరింది శిల్పా కుటుంబం కాదా అని ఎదురుదాడి చేశారు. తమ గుండెల్లో బాబు ఉన్నారని చెప్పి వైసీపీలో చేరారని అన్నారు. వైఎస్ హయాంలో మంత్రిగా చేసి, మళ్లీ టీడీపీలో చేరలేదా అన్నారు. వైఎస్ చనిపోయిన తర్వాత జగన్ పక్కన కాకుండా బాబు వైపు నిలిచారని పేర్కొన్నారు. శిల్ప రవి మాట్లాడుతూ.. టీడీపీలో ఉన్నన్ని రోజులు న్యాయంగానే పనిచేశామన్నారు. భూమా ఫ్యామిలీ వస్తేనే తాము పార్టీ మారామని చెప్పారు. తమ కుటుంబంలోకి చేరేందుకు కారణమైన భూమా ఫ్యామిలీకి శిల్ప రవి థాంక్స్ చెప్పారు.
ఆడపిల్లను అడ్డుపెట్టుకొని..
శిల్ప రవి పోలీసులను అడ్డుపెట్టుకొని అధికారం చెలాయిస్తున్నారని అఖిలప్రియ మండిపడ్డారు. ఆడపిల్లను ఇంట్లోంచి బయటకు రానీయకుండా అడ్డుకున్నారని చెప్పారు. తాను ఫ్యాక్షనిస్ట్ కాదని శిల్ప రవి అన్నారు. వ్యాపారస్తుడినని.. కాలర్ ఎగరేసి చెబుతున్నానని పేర్కొన్నారు. 10 మందికి ఉపాధి ఇస్తున్నానని తెలిపారు. బైపాస్ వస్తోందని తెలిసి భూములు కొనుగోలు చేశారని అఖిలప్రియ ఆరోపించారు. అది ఇన్ సైడర్ ట్రేడింగ్ కాదా అన్నారు. టీడీపీ వారికి ఇన్ సైడర్ ట్రేడింగ్ బాగా తెలుసని శిల్ప రవి అన్నారు. అమరావతిలో వారు అలా చేశారని గుర్తుచేశారు. మిగతావారిని కూడా అలానే అనుకుంటారని చెప్పారు. మెడికల్ కాలేజీ వస్తుందని 50 ఎకరాలు ఇన్సైడ్ ట్రేడింగ్ చేశారని అంటున్నారు.. తనకు ఉన్నది 30 ఎకరాలేనని రవి స్పష్టం చేశారు. మిగతా 20 ఎకరాలు ఎవరైనా తీసుకోవచ్చని సూచించారు. ఆ 30 ఎకరాలు కూడా ఒకే చోట లేవని చెప్పారు. హైదరాబాద్ డెవలప్ అయ్యే ప్రాంతాల్లో భూమి కొన్నామని, తమ ఆస్తుల విలువ పెరిగితే బాధ ఎందుకని ప్రశ్నించారు. కందుకూరులో మీరు 200 ఎకరాలు కొన్నారు. మీ ఆస్తుల విలువ పెరిగితే మేం బాధపడుతున్నామా? ఎదుటి వారిపై ఈర్ష్య పడటం కంటే వాస్తవాలు తెలుసుకోవాలని హితవు పలికారు.