అనంతపురం జిల్లా తాడిపత్రి (Tadipatri) మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి (JC Prabhakar Reddy)పురపాలక కార్యాలయం ఆవరణంలో స్నానం చేస్తూ వినూత్నమైన రీతిలో నిరసన తెలిపారు. తాడిపత్రి మున్సిపల్ కార్యాలయంలోనే నిద్రించారు. ఉదయాన్నే లేచి, మున్సిపల్ కార్యాలయం ఆవరణలోనే బ్రష్ చేశారు. కార్యాలయం ఎదుటే, ఓ కుర్రాడు పైపుతో నీళ్లు పడతుండగా, జేసీ శుభ్రంగా స్నానం చేశారు. అనంతరం నిరసన శిబిరంలో కూర్చున్నారు. మున్సిపాలిటీ(Municipality)లో జరుగుతున్న అక్రమాలపై కమిషనర్, ఇతర అధికారులు పట్టించుకోవడంలేదని కొంతకాలంగా టీడీపీ (TDP) కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. కమిషనర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ టీడీపీ కౌన్సిలర్లు మున్సిపాలిటీ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఈ నిరసనలో జేసీ కూడా పాల్గొన్నారు.
కాగా, ఈ నిరసనకు పెద్దపప్పూరు (Peddappuru), యాడికి మండలాల టీడీపీ(TDP) శ్రేణులు తరలివచ్చాయి. మున్సిపల్ చైర్మన్ జేసీ వెళ్తుండగా శాంతిభద్రత సమస్య తలెత్తుతుందనే ఉద్దేశంతో పోలీసులు (police) గృహ నిర్బంధం చేసిన విషయం విధితమే. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి రాత్రి ఇంటి నుండి మున్సిపల్ కార్యాలయానికి వెళ్తుండగా మార్గం మధ్యలో పోలీసులు అడ్డగించారు.దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డి అర్ధరాత్రి వరకు రహదారి పక్కన డివైడర్ పై బైఠాయించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. ఆదర్శవంతమైన మున్సిపాలిటీని అద్వాన్నంగా తయారు చేశారని మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా (Commissioner Jabbar Mia) బాధ్యత లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. మున్సిపాలిటీ కార్యాలయంలో ఎన్నో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని, టైర్లు, డీజిల్, ఇనుము ఇలా ఇంకా ఎన్నో మాయమవుతున్నాయని, ఇందులో మున్సిపల్ కమిషనర్ పాత్ర కూడా ఉందని ఆయన విమర్శించారు. మున్సిపల్ కమిషనర్ వచ్చేవరకు నిరసన విరమించేది లేదని ఆయన తేల్చి చెప్పారు.