ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది. ఉద్యోగులు… విధులకు ఆలస్యంగా రావడానికి వీల్లేదు అని తేల్చి చెప్పింది. ఇకపై ఉద్యోగులు విధులకు పదినిమిషాలు ఆలస్యమైనా వేతనాల్లో కోతలు విధించాలని నిర్ణయించింది. కార్యాలయాలకు ఖచ్చితమైన సమయానికి హాజరుకావాలని, పదినిమిషాల కంటే ఎక్కువ ఆలస్యమైతే జీతాల్లో కోతలు విధిస్తామని ఏపీ ప్రభుత్వం హెచ్చరించింది. జనవరి 1 వ తేదీ నుండి ఈ ఆదేశాలు అమలౌతాయని, అలసత్వం పక్కన పెట్టి సమయానికి హాజరు కావాల్సిందేనని ఎన్నిమార్లు చెప్పినా, ఉద్యోగులు యధావిధిగా ఆలస్యంగా ఆఫీసులకు వస్తున్నారని, ఇకపై అలా కుదరదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఉదయం 10:10 గంటల వరకు ప్రతి ఒక్కరూ ఆఫీసుల్లో ఉండాల్సిందేనని, సాయంత్రం విధులు ముగిసిన తరువాత మాత్రమే బయటకు వెళ్లిపోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉద్యోగులు సమయపాలనను అనుసరించినపుడే పనులు వేగంగా జరుగుతాయని, ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు జాప్యం జరగడానికి ఉద్యోగులే కారణమనే భావన ప్రజల్లో ఉన్నది. ఈ భావనను తొలగించేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. తప్పని సరిగా 8 గంటలు పనిచేయాల్సిందేనని ప్రభుత్వం ప్రకటించింది. మరి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఉద్యోగులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.