నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జనాల్లోకి వెళుతున్నారు. ఈ రోజు నెల్లూరులో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. తన వర్గీయులతో అన్ని అంశాలపై మాట్లాడారు. పార్టీ నుంచి బయటకు వస్తానని చెబితే ఉలిక్కిపడుతున్నారని కామెంట్ చేశారు. తాను చేసిన తప్పేంటి అని అడిగారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించడం నేరమా? అని నిలదీశారు. నెల్లూరు రూరల్‌లో పథకాలకు నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేకే నిధులు కేటాయించకుంటే ఎలా అన్నారు.
బారాషాహీద్ దర్గాకు రూ.15 కోట్లు ఇస్తామని చెప్పి మాట తప్పారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. అమరావతి రైతులు నెల్లూరు వస్తే, వారిని కలవడం నేరమా? అని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూతో శ్రీధర్ రెడ్డి ధిక్కార స్వరం వినిపిస్తూ వస్తున్నారు. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి లక్ష్యంగా విమర్శించారు.
ఇటు ఆదాల ప్రభాకర్ రెడ్డికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇంచార్జీ బాధ్యతలను పార్టీ అప్పగించింది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ధిక్కార స్వరం వినిపించడంతో నియమించింది. వచ్చే ఎన్నికల్లో ఆయనే పోటీ చేస్తారని సజ్జల ప్రకటించారు. నెల్లూరు మేయర్ పొట్లూరి స్రవంతి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మద్దతు పలికింది. ఈ క్రమంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి కార్పొరేటర్లతో సమావేశం అయ్యారు. నెల్లూరు కార్పొరేషన్‌కి చెందిన 26 మందిలో 18 మంది వచ్చారు. కార్పొరేటర్లకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని ఆదాల తెలిపారు. సమస్య ఉంటే తనకు ఫోన్ చేయాలని స్పష్టం చేశారు.
నెల్లూరు కార్పొరేషన్ మేయర్ సహా 8 మంది కార్పొరేటర్లు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పక్షమేనని తెలుస్తోంది. రేపు ఉదయం 10 గంటలకు తన కార్యాలయంలో మీడియా సమావేశం ఉంటుందని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.