మీరు ఎగ్ ప్రియులా రోజు ఎగ్స్ ఆహారంలో భాగంగా స్వీకరిస్తారా? అయితే ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఎగ్స్ హోల్ సేల్ ధరలకు తెచ్చుకోండి. ఎందుకంటే ప్రస్తుతం కోడిగుడ్ల రేట్లు భారీగా పెరిగాయి. ప్రస్తుతం ఎగ్ రిటైల్ మార్కెట్లో 7 రూపాయలకు సేల్ చేస్తున్నారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.
గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కోడి గుడ్ల రేట్లు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం కోడి గుడ్లను రిటైల్ మార్కెట్లో 7 రూపాయలకు అమ్ముతున్నారు. విశాఖ(visakhapatnam) మార్కెట్లో మంగళవారం హోల్‌సేల్‌గా వంద కోడిగుడ్లు రూ.580గా నిర్ణయించారు. జాతీయ గుడ్డు సమన్వయ కమిటీ (NEC) విజయనగరం, శ్రీకాకుళం మార్కెట్లో రూ.584 ఖరారు చేసింది. నెక్ హిస్టరీలో ఇదొక ఆల్ టైమ్ రికార్డ్ అని అన్నారు. ఈ క్రమంలో చిల్లరగా రూ.6.50 నుంచి రూ.7 వరకు గుడ్డు విక్రయిస్తున్నారు. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల కోసం కేక్‌ల తయారీకి గుడ్లను విరివిగా ఉపయోగిస్తారు. అలాగే చలికాలంలో కోల్‌కతా మార్కెట్లో గుడ్డుకు డిమాండ్ పెరిగింది. ఇప్పటి వరకు ఈ ఏడాది జనవరిలో రూ.575 రేటు పలకడం రికార్డు కాగా… ఇప్పుడు అది ముగిసింది.
ఈ ఏడాది వేసవి తర్వాత గుడ్డు రేటు క్రమంగా తగ్గడంతో కోళ్ల ఫారాల నిర్వాహకులు నష్టపోయారు. జూన్ నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల్లో కోళ్ల ఫారాల్లో గుడ్ల ఉత్పత్తి తగ్గింది. రోజుకు సగటున 43 లక్షల నుంచి 45 లక్షల గుడ్లు ఉత్పత్తి అయ్యే ఉత్తరాంధ్రలో ప్రస్తుతం 36 లక్షల నుంచి 37 లక్షల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. అదే సమయంలో ఉత్తరాంధ్రలో సగటున రోజుకు 33 నుంచి 35 లక్షల వరకు వినియోగిస్తున్నారు. మరో రెండు రోజుల్లో కార్తీక మాసం ముగియనుండడంతో వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కోల్ కతా మార్కెట్ కు రోజుకు నాలుగైదు లక్షల గుడ్లు ఎగుమతి అవుతున్నాయి. వీటన్నింటి నేపథ్యంలో కోడిగుడ్లకు(eggs) గిరాకీ పెరిగి ధర పెరిగింది. రానున్న వారాల్లో గుడ్ల ధర మరింత పెరిగే అవకాశం ఉందని NEC వర్గాలు చెబుతున్నాయి.