పాదయాత్ర ఇప్పుడు అందరికీ ఓ ఫ్యాషన్‌గా మారిందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను ఉద్దేశించి కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి విమర్శలు గుప్పించారు. ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తే, వారు ఆదరిస్తారు, గౌరవిస్తారని, కానీ జగన్ హయాంలో ఏపీ సంతోషంగా ఉందని చెప్పారు. ఇలాంటప్పుడు పాదయాత్ర చేస్తే ఎవరూ హర్షించరన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లకు మాత్రమే కష్టాలు ఉన్నాయని, ప్రజలు మాత్రం ఆనందంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. 80 శాతం మంది ప్రజలకు నవరత్నాలు అందుతున్నట్లు తెలిపారు. నవరత్న పథకాలు తీసుకున్నవారు లోకేష్ పాదయాత్రలో పాల్గొనడం మంచిది కాదన్నారు. ఇదిలా ఉండగా, లోకేష్ యువగళం పాదయాత్ర ఆరవ రోజైన బుధవారం చిత్తూరు జిల్లా కమ్మనపల్లె నుండి ప్రారంభమైంది. కొలమసానిపల్లె వద్ద మహిళలతో భేటీ అయ్యారు. రాత్రికి రామాపురం ఎమ్మోస్ హాస్పటల్ దగ్గర బస చేస్తారు.