ఆంధ్రప్రదేశ్ రాజధానిపై కేంద్ర ప్రభుత్వం బుధవారం పార్లమెంటు సాక్షిగా స్పష్టతను ఇచ్చింది. విభజన చట్టం ప్రకారం ఏపీ రాజధాని అమరావతి (Amaravati) అంటూ తేల్చి చెప్పింది. ఈ మేరకు రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి (Vijaya Sai Reddy) అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రాతపూర్వక సమాధానం ఇచ్చింది. సెక్షన్ 5, 6 ప్రకారం రాజధాని ఏర్పాటు జరిగిందని గుర్తు చేసింది. అమరావతిని (Amaravati) రాష్ట్ర రాజధానిగా 2015లో నిర్ణయించినట్లు తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విభజన జరిగిన అనంతరం అమరావతిని (Amaravati) రాజధానిగా నోటిఫై చేసిందని తెలిపింది. కానీ 2020లో ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును తీసుకువచ్చిందని, ఈ అంశంపై తమను సంప్రదించలేదని వెల్లడించింది. ప్రస్తుతం ఏపీ రాజధాని అంశం న్యాయస్థానాల పరిధిలో ఉందని, దీనిపై మాట్లాడితే కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని కుండబద్దలు కొట్టింది.
ఏపీ విభజన చట్టం సెక్షన్ 56 ప్రకారం కేంద్రం రాజధాని నిర్మాణం అధ్యయనం కోసం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిందని, అధ్యయన నివేదికను తదుపరి చర్యల కోసం ఏపీ ప్రభుత్వానికి పంపించినట్లు పేర్కొంది కేంద్రం. 2015లో ఏపీ ప్రభుత్వం రాజధానిని నోటిఫై చేసిందని, కానీ 2020లో మళ్లీ కేంద్రాన్ని సంప్రదించకుండా మూడు రాజధానుల బిల్లు తీసుకు వచ్చిందన్నారు. రాజధాని అంశంపై హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిందని, కాబట్టి దీనిపై మాట్లాడటం సరికాదని కేంద్రమంత్రి నిత్యానందరాయ్ తెలిపారు.