Viral: జాబ్ మానేయండి..ఆకలి కావడం లేదు..పండగ కూడా చేసుకోలేదు: బండ్ల గణేష్
మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్‌తో ఏపి రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. రోజు రోజుకి బాబుకి మద్దతు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బండ్ల గణేష్ సంఘీభావాన్ని తెలియజేశారు.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్, రిమాండ్‌ను నిరసిస్తూ ఏపీతో పాటుగా తెలంగాణలో కూడా నిరసనలు కొనసాగుతున్నాయి. టీడీపీ, జనసేన పార్టీ కార్యకర్తలతో పాటుగా ఐటీ ఉద్యోగులు, పలు సంఘాలు ఈ ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. తాజాగా చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ హైదరాబాద్‌లో జరిగిన నిరసన కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ పాల్గొన్నారు. ఆయన కూడా బాబు అరెస్ట్‌పై సంఘీభావాన్ని తెలియజేశారు.
చంద్రబాబు పేరు వాడుకొని ఎంతోమంది లబ్ధి పొందారని, ఎంతోమంది జీవితాలు నిలబెట్టారని అన్నారు. బాబు అరెస్ట్ తనను ఎంతగానో బాధించిందని, ఈసారి తన ఇంట్లో వినాయక చవితి వేడుకలు కూడా జరుపుకోలేదని చెప్పారు. పార్కుల ముందు, రోడ్లపై కాకుండా.. సొంతూళ్లకు వెళ్లి బొడ్రాయి ముందు కూర్చుని అందరూ ధర్నాలు చేయాలని బండ్ల గణేష్ పిలుపిచ్చారు.
ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు ఎంతో కృషి చేశారని.. ఐటీ ఉద్యోగులు నెల రోజుల పాటు ఉద్యోగాలు మానేసి, సొంతూళ్లకు వెళ్లి ధర్నాల్లో పాల్గొనాలని బండ్ల గణేశ్ అన్నారు. చంపుతారా.. చంపేయమని చెప్పండని.. చంద్రబాబు రాజమండ్రి జైల్లో మగ్గుతుంటే అన్నం కూడా తినబుద్ధి కావట్లేదని.. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలుస్తారని.. ముఖ్యమంత్రి అవుతారని బండ్ల గణేష్ జోస్యం చెప్పారు.