నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థతిపై నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందించారు. ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పారు. లైఫ్ సపోర్ట్ సిస్టమ్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం అంతా నిలకడగానే ఉందని, పరిస్థితిపై ఆందోళన అవసరం లేదన్నారు. ఇంప్రూవ్మెంట్ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. డాక్టర్లు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
తారకరత్న అందరితో కలివిడిగా ఉండే వ్యక్తి అన్నారు. అతను త్వరగా కోలుకోవాలని అందరూ ప్రార్థనలు చేయడం ఆనందం కలిగిస్తోందన్నారు.
అందరి ఆశీస్సులు, ప్రార్థనలతో ఆయన త్వరగా కోలుకుంటాడని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇంటర్నల్ బ్లీడింగ్ కారణంగా తారకరత్నకు స్టంట్ వేయడం కుదరలేదన్నారు. అలా చేస్తే మళ్లీ హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదముందన్నారు. తారకరత్న ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉన్నారన్నారు. ఒక్కోసారి రెస్పాండ్ అవుతున్నాడని, కొన్నిసార్లు అవ్వడం లేదన్నారు. కళ్లలో కాస్తా మూమెంట్ కనిపిస్తోందని, బ్రెయిన్ డ్యామేజ్ ఎంత అయిందనేది తర్వాత తెలుస్తుందన్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు శివరాజ్ కుమార్ వచ్చారని, ఆనందంగా ఉందన్నారు.
తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని, అతనికి తాత గారి ఆశీస్సులు ఉన్నాయని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. ఆయన బెంగళూరులో హాస్పిటల్ కు వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. తారకరత్న పోరాడుతున్నారని, క్రిటికల్ గా ఉన్నప్పటికీ వైద్యానికి సహకరిస్తున్నారని చెప్పారు. తాను కొంత పలకరించే ప్రయత్నం చేయగా.. కాస్త స్పందన కనిపించిందని చెప్పారు. నిన్నటితో పోలిస్తే బాగుందన్నారు. ఆయన సాధ్యమైనంత త్వరలో బయటకు వస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. కర్ణాటక ప్రభుత్వం ఎంతో సహకరిస్తోందన్నారు.