స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు కొనసాగుతున్నాయి. పోలీసులు ఎక్కడికక్కడ టీడీపీ కార్యకర్తలను హౌస్ అరెస్ట్ చేశారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసు విషయంలో సీఐడీ విచారణకు చంద్రబాబు సహకరించడం లేదని, మాట దాటవేస్తున్నారని సమాచారం. సీఐడీ అధికారులు తాము సేకరించిన ఆధారాలను చంద్రబాబుకు చూపించి ప్రశ్నలు అడిగారు. అయితే వారికి ఎటువంటి సమాధానం చెప్పకుండా చంద్రబాబు కూర్చున్నట్లు సమాచారం. ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించి తమకు లభించిన సాక్ష్యాల ఆధారంగా చంద్రబాబుకు 20 ప్రశ్నలు అడిగారు.
ఆ సందర్భంగా చంద్రబాబు (Chandrababu) వారికి సమాధానం ఇస్తూ.. రాజకీయాల్లో తనకు 40 ఏళ్లకంటే ఎక్కువ అనుభవం ఉందని, పోలీసులను ఏం చేయాలో తనకు తెలుసంటూ ఎదురుదాడి చంద్రబాబు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. సీఐడీ ప్రశ్నల్లో ఎక్కువ భాగం హవాలా లావాదేవీలపైనే సాగింది. ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టించారనే అంశాలపై చర్చించారు.
2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రాసిన నోట్ ఫైల్స్ ను అధికారులు ఆయనకు చూపించారు. స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించి సీమెన్స్ కంపెనీతో ఆగస్టు 21, 2015న చంద్రబాబు ఒప్పందం చేసుకున్నట్టు చీఫ్ సెక్రటరీ తనకు తెలిపారని ఆర్థికశాఖ కార్యదర్శి ఆ లేఖలో పేర్కొన్నారు. ఆ సమయంలో రూ.371 కోట్ల నిధులను తక్షణమే విడుదల చేయాలని కూడా ఆ నోట్ ఫైల్లో ఉంది.
దాంతో పాటుగా ఆగస్టు 27న రూ.270 కోట్ల నిధులకు సంబంధించిన బ్యాంక్ రిలీజ్ ఆర్డర్‌ను కూడా విడుదల చేసినట్లు మరో నోట్లో ఉంది. దాంతో పాటు చంద్రబాబుకు, ఆయన పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌తో జరిగిన వాట్సాప్ చాట్లకు సంబంధించిన స్క్రీన్ షాట్లను సీఐడీ అధికారులు చూపించి ప్రశ్నించారు. చంద్రబాబు మాత్రం తనకేం తెలియదని, అసలు గుర్తు లేదంటూ పొంతన లేని సమాధానాలిచ్చినట్టు సమాచారం. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబును కలిసేందుకు ఆయన సతీమణి నారా భువనేశ్వరి, తనయుడు నారా లోకేష్ తో పాటు నందమూరి రామకృష్ణ, పలువురు టీడీపీ నేతలు సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. చంద్రబాబును కలవడానికి భువనేశ్వరి, లోకేష్‌కు అధికారులు అనుమతి ఇచ్చారు.