»Babu Arrested Two Tdp Workers Died Of Heart Attack
Chandrababu: బాబు అరెస్ట్..గుండెపోటుతో ఇద్దరు టీడీపీ కార్యకర్తలు మృతి
ఏపీలో చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా టీడీపీ కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు. రోడ్డుపై భైటాయించి ధర్నా చేపడుతున్నారు. అయితే పోలీసులు ఎక్కడికక్కడ పరిస్థితిని అదుపులోకి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బాబు అరెస్ట్‌ను జీర్ణించుకోలేని ఇద్దరు టీడీపీ కార్యకర్తలు గుండెపోటుతో మరణించిన ఘటనలు కలకలం రేపుతున్నాయి.
టీడీపీ (TDP) అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అరెస్ట్‌తో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నెలకొన్నాయి. అయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. టీడీపీ ముఖ్యనేతలను ముందస్తుగా హౌస్ అరెస్ట్ (House Arrest) చేశారు. ఆందోళన చేస్తున్నవారిని ఎక్కడికక్కడ అదుపు చేస్తున్నారు. తాజాగా బాబు అరెస్ట్ వార్త విన్న ఇద్దరు టీడీపీ కార్యకర్తలు గుండెపోటుతో మృతిచెందారు.
చంద్రబాబు అరెస్ట్ వార్తను టీవీలో చూసిన వడ్డే ఆంజనేయులు గుండెపోటు (Heart Attack)తో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వడ్డే ఆంజనేయులుది అనంతపురం జిల్లాలోని గుత్తి మండలం. ధర్మపురం గ్రామంలో ఆయన టీడీపీ కార్యకర్తగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఆయన మరణంతో విషాదచాయలు అలముకున్నాయి.
మరోవైపు గుంటూరు జిల్లా బుడంపాడు గ్రామానికి చెందిన మైలా శివయ్య కూడా చంద్రబాబు అరెస్ట్ వార్తను చూసి గుండెపోటుతో మరణించారు. చాలా ప్రాంతాల్లో చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా రహదారులపై ధర్నా చేపడుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. బాబు అరెస్ట్‌ను జీర్ణించుకోలేక రేపల్లెలో ఓ మహిళా కార్యకర్త తన ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. పోలీసులు ఎక్కడికక్కడ ప్రత్యేక చర్యలతో టీడీపీ కార్యకర్తల నిరసనలను అదుపు చేస్తున్నారు.